ఓ అగ్ని ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్ని కీలలు క్షణాల్లో చుట్టుముట్టి 13 ఇళ్లను బూడిద చేసి... కట్టు బట్టలతో వంద మందిని రోడ్డున పడేసింది. ప్రాణాలనైతే కాపాడుకోగలిగారు కానీ... ఆస్తిని కోల్పోయారు. బతికున్నామన్న ఆశ మిగిలింది... ఎలా బతకాలో తెలియడం లేదని గగ్గోలు పెడుతున్నారు బాధితులు.
గూడు కాలింది... గోడు మిగిలింది - బోయిన్పల్లి బాపూజీనగర్‌లో అగ్నిప్రమాదం
బతుకుదెరువు కోసం నగరానికి వలసొచ్చి... కాయకష్టం చేసుకుంటూ... గుడిసెలు వేసుకుని బతుకీడుస్తున్న వారిపై అగ్నికీలలు విరుచుకుపడ్డాయి. కళ్లెదుటే ఆశ్రయమిచ్చిన గూడును బుగ్గి పాలు చేశాయి. కట్టుబట్టలతో నడిరోడ్డుపై నిలబెట్టాయి. సికింద్రాబాద్ బోయిన్పల్లి బాపూజీనగర్‌లో ఓ గుడిసెలో జరిగిన అగ్నిప్రమాదంలో 13 గుడిసెలు కాలిబూడిదై... వందమంది నిరాశ్రయులయ్యారు.
సికింద్రాబాద్ బోయిన్పల్లి బాపూజీనగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 గుడిసెలు పూర్తిగా దగ్దమయ్యాయి. కొన్నేళ్లుగా వివిధ జిల్లాల నుంచి వచ్చి కూలి పని చేసుకుని బతుకుతున్న వారి గుడిసెలు బుగ్గిపాలయ్యాయి. ఓ గుడిసెలో సిలిండర్ పేలి క్షణాల్లోనే పక్క ఇళ్లకు వ్యాపించాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద స్థలాన్ని మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు. బాధితులను పరామర్శించి ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న దంపతులు