ముఖం చూడగానే ప్రేమ పుడుతుంది కానీ అవతలి వారు ఎలాంటోళ్లో ఎలా చెప్పగలం అనే ప్రశ్న రావొచ్చు. ముఖం చూడగానే ప్రేమలో పడిపోయి గుడ్డిగా ముందుకు వెళ్లిపోలేము కదా. కావాల్సిన వస్తువునే అన్నీ పరిశీలించి తీసుకునే మనం.. మనం జీవితాంతం గడపాల్సిన వారిని ఎంచుకునే విషయంలో పొరపాటు చేస్తే దాని ఫలితం మనతో పాటు మనవాళ్లు జీవితాలు. అందుకే మీది ప్రేమా, ఆకర్షణా పక్కాగా తెలుసుకోండి ఇలా..
మీ ప్రేమ ఎలా మొదలైంది:మొదట మీ ప్రేమ ఎలా మొదలైందో ఒక్కసారి గుర్తుచేసుకోండి. మీ ప్రయాణంలో ఎదురైన ఒక్కో మలుపు.. ఆసందర్భంలో మీరు, మీ భాగస్వామి స్పందించిన విధానం.. తీసుకున్న నిర్ణయాలను పరిశీలించండి.
తన స్నేహితుల వద్ద మీగురించి ఏమి చెబుతున్నారు:చాలా మంది తన మనసును స్నేహితుల ముందు కచ్చితంగా బహిర్గతం చేస్తారు. ఏదొక సమయంలో మీ ప్రస్తావన వచ్చే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మీ గురించి ఏవిధంగా చెబుతున్నారు అనేది తెలుసుకోవడం చాలా మంచిది. అలాగని వాళ్లు వీళ్లు చెప్పినవి గుడ్డిగా నమ్మేయడం కూడా చాలా ప్రమాదం.
మీకు వెచ్చించే సమయం:ప్రేమలో పడిన కొత్తలో మన భాగస్వామి మనతో ఎక్కువ సేపు మాట్లాడడం, గడపడం చేస్తారు. కానీ తర్వాత రోజులు గడిచే కొద్దీ ఆ రిలేషన్లో ఏమైనా మార్పులు వస్తున్నాయోమో గమనించండి. ఏదైనా చెప్పినప్పుడు దాటవేయడం, అధికంగా అబద్దాలు చెప్పడం లాంటివి జరుగుతున్నాయోమో గమనించండి.
చేసే వాగ్దానాలు:ప్రేమలో ఉన్నప్పుడు మన పార్ట్నర్కి మనవల్ల ఏదైనా కాస్త అసౌకర్యం కలిగినా.. కోపం కలగడానికి కారణం అయినా వాగ్దానాలు చేస్తుంటాం. అలాంటి సందర్భాల్లో మీతో రిలేషన్లో ఉన్నవారు ఎలాంటి వాగ్దానాలు చేస్తున్నారు. అవి నెరవేరేవేనా వంటి వాటిని ఓసారి బేరీజు వేసుకోండి. ఎందుకంటే మాటలతో మేడలు కట్టగలం.. కానీ నిజ జీవితంలో చెప్పినవి చాలా నెరవేర్చలేము.
మీవద్ద చెప్పిన అబద్ధాలు:మనిషి జీవితంలో అబద్ధం చెప్పలేనివారు అంటూ ఎవరూ లేరు. ప్రధానంగా ప్రేమలో ఉన్నవారు వీటిని చాలా సందర్భాల్లో ఉపయోగించే ఉంటారు. కానీ చెప్పిన అబద్ధం వల్ల ఎదురయ్యే ప్రతిఫలం మీ బంధాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. మీరు చెప్పేది అబద్ధమని.. దానివల్ల అవతలి వ్యక్తికి తీవ్ర నష్టం జరుగుతుందని అవతలి వారికి తెలిసినప్పుడు మీ బంధం నిలవదు. కత్తికంటే పదునైన మాటను జాగ్రత్తగా పరిశీలించండి. ఆకర్షణలో ఇలాంటి అబద్ధాలకు కొదవే ఉండదు. మాటల్లోనే మీరు అవతలి వారిని అంచనా వేయవచ్చు.
తన ఫ్యామిలీ, వ్యక్తిగత విషయాలు:ప్రేమిస్తున్నామంటే ఏదో గుడ్డిగా నమ్మేయకండి. అవతలి వారి కుటుంబ, వ్యక్తిగత వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. ఏదో సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు, చూడడానికి బాగుంటారు. అనుకుని ముందుకు వెళ్లిపోతే బొక్కబోర్లా పడడం ఖాయం.