ప్రస్తుతం బాధిత కుటుంబాలు ఉన్నదాంట్లో సర్దుకుంటున్నాయి. ప్రతి నెలా రూ.వేలు ఖర్చు చేసి జీవనం గడిపేవారు. ప్రస్తుతం అరకొర నగదుతో పూట గడిస్తే చాలు అనే స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే నా అనే వారి నుంచి సాయం పొంది అప్పులపాలవ్వగా.. మరెవరూ అప్పులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. చౌక బియ్యం, అరకొర సరకులు.. అప్పుడప్పుడు తెచ్చుకునే కూరగాయలతో భోజనం చేసి కాలం వెళ్లదీసుకునే పరిస్థితి ఏర్పడింది.
వెంటాడుతున్న నిరుద్యోగం..:ఇన్నాళ్లు దాచిపెట్టుకున్న బంగారం, చేతిలో ఉన్న నగదుతో కాలం వెల్లదీసుకున్నాం. ఇక నుంచి బతుకెలాగంటూ నిరుద్యోగుల్లో కలవరం మొదలైంది. కరోనా బారిన పడిన నిరుద్యోగ కుటుంబాల్లో అయితే ఐసొలేషన్‌లో ఉండి బతకడానికి కష్టంగా మారింది. పౌష్టికాహారం లేక రోజు మందులకు అయ్యే ఖర్చులు భరించుకోలేకపోతున్నారు. లాక్‌డౌన్‌తో ఇంట్లో కూర్చోవాల్సి వస్తోంది. బయటికి వెళ్లలేక ఇంట్లో ఉండలేక.. భవిష్యత్ బతుకెలాగంటూ నిరుద్యోగులు కుమిలిపోతున్నారు.
- తాండూరు పట్టణానికి చెందిన ఓ మధ్య తరగతి కుటుంబం వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆరునెలల కిందట దాచిన డబ్బులతోపాటు మరికొంత అప్పు చేసి ఇల్లు కట్టుకున్నారు. ఏడాది గడవలేదు. నెల క్రితం ఆ కుటుంబ పెద్దకు కొవిడ్ సోకింది. ఇరవై రోజులుగా రూ.15 లక్షలు ఖర్చు చేసి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయినా ఫలితం దక్కలేదు. అప్పు కుటుంబానికి భారంగా మారింది.
- వికారాబాద్ పట్టణానికి చెందిన ప్రైవేటు ఉద్యోగికి పాజిటివ్ వచ్చింది. వారం రోజుల పాటు ఇంట్లో ఉండి వైద్యం పొందారు. శ్వాస ఇబ్బంది రావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 16రోజుల పాటు చికిత్స చేయించుకున్న ఆయన కోలుకున్నారు. ఆస్పత్రి ఖర్చు రూ.8లక్షలు దాటింది. ఇంటికొచ్చాక కష్టపడి కొనుగోలు చేసిన ఇంటి స్థలాన్ని విక్రయించి సహాయం చేసిన వారి అప్పులు తీర్చారు.