Financial Assistance to TS BC and MBC Caste workers : రాష్ట్రంలో కులవృత్తులతో జీవనోపాధి పొందుతున్న ఎంబీసీ, బీసీల నుంచి దాదాపు లక్షన్నర మందికి ఆర్థిక సాయంపై ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించనుంది. ప్రతి నియోజకవర్గంలో 1200 నుంచి 1500 మందికి లబ్ధి చేకూర్చేలా కసరత్తు చేస్తోంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా పూర్తి సబ్సిడీతో లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ఆ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొలి విడత పథకాన్ని ప్రకటించనుంది.
దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక సాయం తదితర విధివిధానాలను మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేయనుంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు సమావేశమై, సీఎం కేసీఆర్ సమక్షంలో తుదివిధానాలు ప్రకటించనుంది. నాయీ బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, కుమ్మరి, మేదరి, రజక, పూసల వర్గాలతో పాటు.. మరిన్ని కులాలను గుర్తించిన ఉపసంఘం.. ఆయా వివరాలను వెల్లడించనుంది. అర్హులైన.. కులవృత్తులు చేసుకుంటున్న కుటుంబాల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు తీసుకొని తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లోభాగంగా పంపిణీ చేయనుంది. జూన్ 9న ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గాల వారీగా చేపట్టే అవకాశాలున్నాయి.
"రాష్ట్రంలో కులవృత్తులతో జీవనోపాధి పొందుతున్న ఎంబీసీ, బీసీలకు ఆర్థిక స్వావలంభన కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా పూర్తి సబ్సిడీతో లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనుంది. జూన్ 9న ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గాల వారీగా ప్రారంభిస్తాము". - హరీశ్‌రావు, ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి