కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోజురోజుకూ పలు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పరిస్థితులు తీవ్రంగా మారుతుండటం వల్ల లాక్‌డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో అంచనాకు అందడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎంతో బాధ్యతగా మెలగాల్సి ఉంది. అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వాడుకోవాలి. లేదంటే భవిష్యత్తులో అందరూ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అనవసర ఖర్చులు కూడా తగ్గిస్తే ఆదా అయ్యే డబ్బు రానున్న రోజుల్లో ఆదుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘ప్రత్యేక కథనం.
నీటి పొదుపు తప్పనిసరి
నీటిని పొదుపుగా వినియోగించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రస్తుతం అందరూ ఇళ్లలోనే ఉండటం వల్ల నీటి వినియోగం కూడా అదే స్థాయిలో పెరిగింది. చేతులు శుభ్రం చేసుకునేందుకు, ఇళ్లను కడిగేందుకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఫలితంగా నీటి వినియోగం పెరిగి కొన్ని ప్రాంతాల్లోని బోర్లలో నీటి మట్టం పడిపోతోంది. విలువైన మిషన్ భగీరథ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడేందుకు ప్రయత్నించాలి.
నిత్యావసరాలు పదిలం
నిత్యావసర వస్తువులను ప్రజలు రెండు, మూడు నెలలకు సరిపడా కొనుగోలు చేస్తున్నారు. వస్తువుల కొరత ఏర్పడి డిమాండ్ పెరగడంతో ఈ పరిస్థితిని ఆసరా చేసుకొని సొమ్ముచేసుకునేందుకు వ్యాపారులు ధరలు పెంచుతున్నారు. ధరల పెరుగుదల పేద, మధ్య తరగతి కుటుంబాలకు సమస్యగా మారింది. ఎంత అవసరమో అంతే కొనుగోలు చేస్తేనే అందరూ బాగుంటారని గుర్తించాలి. ప్రభుత్వం నిత్యావసరాల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నందున అవసరం లేకున్నా కొనుగోలు చేసే పద్ధతి మానుకోవాలి.
ప్రతి పైసా జాగ్రత్త
ఖాళీగా ఉండటంతో అనవసర ఖర్చులు పెరుగుతున్నాయి. డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డులతో కొంటున్నారు. రేపు దొరుకుతాయో లేదో అన్న అనుమానంతో ప్రస్తుతం అవసరం లేని వస్తువులను కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు బయట అప్పు పుట్టే పరిస్థితులు కూడా లేవు. భవిష్యత్తు అవసరాలు ఎలా ఉంటాయో అని చాలామంది డబ్బులు ఎవరికీ ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో అనవసర ఖర్చులు తగ్గించి వైద్యం, ఇతర అత్యవసర ఖర్చుల కోసం డబ్బులు ఆదా చేస్తే భవిష్యత్తులో అండగా ఉంటుంది.