రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వివిధ రాష్ట్రాలతో కేంద్ర మంత్రి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వీడియో కాన్పరెన్స్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణా చర్యలను హరీశ్ రావు వివరించారు. మొదటి వేవ్ కరోనా సందర్భంలో ఉన్న మౌలిక వసతులను రెండో వేవ్ వరకు రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచిందని తెలిపారు.
అప్పుడు కేవలం 18,232 పడకలు మాత్రమే ఉండగా ఇపుడు వాటి సంఖ్య 53,775కి పెరిగిందన్నారు. అంటే మూడు రెట్లు పెరిగిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో... 9,213గా ఉన్న ఆక్సిజన్ పడకలను 20,738కు, ఐసీయూ పడకలను 3,264 నుంచి 11,274కు పెంచిందనట్లు వివరించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇంటింటి ఫీవర్ సర్వేను నిర్వహిస్తున్నామని.. అంగన్ వాడీ, ఆశావర్కర్లు, ఏఎన్ఎం సిబ్బందితో కూడిన 27,039 బృందాలు ఇంటింటికి వెళ్లి జ్వరపరీక్షలు నిర్వహిస్తున్నాయని కేంద్ర మంత్రికి తెలిపారు.
అనుమానితులకు కరోనా నియంత్రిత మందులతో కూడిన హెల్త్ కిట్లను ఉచితంగా ప్రభుత్వం అందిస్తోందన్న మంత్రి... తద్వారా కరోనా సోకిన విషయం పట్ల అవగాహన లేని వారిని గుర్తించి వ్యాప్తి చెందకుండా ముందస్తుగా అడ్డుకోవడం, ఆస్పత్రుల్లో చేరే పరిస్థితి, మరణించే ప్రమాదాల నుంచి కాపాడినట్లవుతుందని తెలిపారు. ఇంటింటి సర్వే సత్ఫలితాలను ఇస్తోందని... ఇప్పటివరకు రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో కోవిడ్ జ్వర పరీక్షలను నిర్వహించి అనుమానితులను ఐసోలేషన్‌లో ఉంచి హెల్త్ కిట్లు అందించినట్లు హరీశ్ రావు వివరించారు.
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి లాక్‌డౌన్ అమలవుతోందని కేంద్రమంత్రికి తెలిపారు. రాష్ట్రం తరఫున పలు విజ్జప్తులు చేశారు. తెలంగాణ మెడికల్ హబ్‌గా మారిన నేపథ్యంలో స్థానిక కరోనా రోగులు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగుల రద్దీ విపరీతంగా పెరిగిందని... మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి పాజిటివ్ వచ్చిన వారు రాష్ట్రానికి వచ్చి చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌గా నమోదై తెలంగాణకు వచ్చి చికిత్స తీసుకుంటున్న పరిస్థితుల్లో లెక్కల్లో తేడా వస్తోందన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారిందని హరీశ్ రావు వివరించారు. రాష్ట్రంలో మందుల కొరత పెరిగేందుకు ఈ తేడా ప్రధాన కారణమని కేంద్ర మంత్రికి వివరించారు.