తెలంగాణలో 50 వేల ఉద్యోగాలు భర్తీ(Job recruitment) చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పదోన్నతుల ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండో దశలో భర్తీ చేయాలన్నారు. ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం స్పష్టం చేశారు. ఆ దిశగా రాష్ట్ర ఆర్థిక శాఖ అడుగులు వేస్తోంది. ఖాళీల వివరాలపై కసరత్తు చేస్తోంది. శాఖల వారీగా ఖాళీల వివరాలను ఆర్థికశాఖ సమీక్షిస్తోంది. ఈ మేరకు వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు శనివారం సమావేశమయ్యారు. ఇప్పటికే శాఖలు సమర్పించిన ఖాళీల వివరాలను సమీక్షించారు. ఆయా శాఖల వారీగా ఉన్న ఖాళీల వివరాలపై చర్చించారు. ఇవాళ మిగతా శాఖల కార్యదర్శులు, అధికారులతో కసరత్తు జరుగుతోంది.
కేబినెట్‌కు నివేదిక
స్పష్టంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఖాళీల్లో ఎంత మంది ఒప్పంద, పొరుగుసేవల విధానంలో పనిచేస్తున్నారు. తదితర వివరాలను సమీక్షిస్తున్నారు. 50వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్... మంగళవారం జరగనున్న మంత్రివర్గ సమావేశానికి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా అధికారులు ఖాళీల వివరాలపై కసరత్తు చేస్తున్నారు. దాని ఆధారంగా కేబినెట్‌కు నివేదిక అందిస్తారు. ఈనెల 13న మంత్రిమండలిలో మొత్తం ఉద్యోగాల భర్తీ(Job recruitment)కి ఆమోదం తెలియజేయనున్నారు.