TS Police recruitment 2022 : తెలంగాణలో పోలీస్ కొలువుల కోలాహలం మరోమారు మొదలైంది. లక్షలాది నిరుద్యోగ యువత పోలీస్‌శాఖలో ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న వేళ.. ఎంపిక ప్రక్రియను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్‌పీఆర్‌బీ) ప్రారంభించింది. సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. మే నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు సిద్ధమవుతోంది.
గతానుభవాల దృష్ట్యా దరఖాస్తుల వడబోతను మరింత పకడ్బందీగా చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. అంతకుముందు నోటిఫికేషన్ల క్రమంలో జరిగిన తప్పిదాలను ఈసారి ముందుగానే నియంత్రించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ధ్రువీకరణపత్రాలను జతచేసే దరఖాస్తుదారులను ఆదిలోనే గుర్తించడంపై దృష్టి సారించనుంది. ఇలాంటి వారితో క్రితంసారి బ్యాక్‌లాగ్స్ భారీగా మిగలడంతో ఈసారి సాధ్యమైనంతగా వాటిని నివారించే యోచనతో అధికారులు ఉన్నారు.
‘ఎక్స్’ సర్వీస్‌మెన్ కోటాకు కొత్త భాష్యం: సాధారణంగా పోలీస్ నియామకాల్లో మాజీ సైనికోద్యోగుల(ఎక్స్ సర్వీస్‌మెన్)కు ప్రత్యేక కోటాతో పాటు సడలింపులుంటాయి. ఈ కోటాలో కొలువులు సాధించేందుకు గతంలో పెద్దఎత్తున తప్పుడు ధ్రువీకరణపత్రాల్ని సృష్టించి దరఖాస్తులకు జత చేశారు. రాష్ట్రంలో ఉన్న మాజీ సైనికోద్యోగులకంటే ఎక్కువగా ఇలా దరఖాస్తులు రావడంతో అధికారులకు అనుమానమొచ్చింది. ఆరా తీస్తే పెద్దఎత్తున తప్పుడు ధ్రువీకరణపత్రాలు బహిర్గతమయ్యాయి.