Film Producer Anjireddy Murder Case Update :ప్రముఖ నిర్మాత అంజిరెడ్డి హత్య కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. పక్కా పథకం ప్రకారం ఆయన ఆస్తికొట్టేసేందుకే రాజేశ్ అనే వ్యక్తి హత్య చేశారని పోలీసులు నిర్ధరించారు. ఈ కేసులో మరికొందరు కూడా భాగమైనట్లు అనుమానిస్తున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. మరోవైపు అంజిరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలను పోలీసులు తాజాగా వెల్లడించారు.
సీహెచ్ అంజిరెడ్డి 1990 సంవత్సరంలో పలు సినిమాలను స్నేహితులతో కలిసి నిర్మించారు. సినీ పరిశ్రమలో వివాద రహితుడిగా ఆయన పేరు సంపాదించారు. అనంతరం సినీ పరిశ్రమ నుంచి బయటకు వచ్చి వ్యాపారం చేశారు. ఆయన ముగ్గురు పిల్లలు స్థిరపడటంతో.. తన భార్యతో అంజిరెడ్డి అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ కావాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రయాణ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. విదేశాలకు వెళ్లే లోపుగానే సైదాబాద్, పద్మారావునగర్‌లోని తన ఆస్తులను విక్రయించాలని అంజిరెడ్డి అనుకున్నారు.
ఇదే విషయాన్ని అంజిరెడ్డి తనకు పరిచయం ఉన్న రియల్‌ఎస్టేట్ వ్యాపారులకు చెప్పారు. సైదాబాద్‌లోని ఇంటి విక్రయంలో ఇబ్బందులు ఎదురవటంతో ఒత్తిడికి గురయ్యారు. పద్మారావునగర్‌లో ఎంతో ఇష్టంగా నిర్మించిన ఇంటిని ఎలాగైనా విక్రయించాలనుకున్నారు. గత నెల రెండో వారంలో సినీ ఫొటోగ్రాఫర్ రవి ద్వారా జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేశ్ (Rajesh) పరిచయమయ్యాడు. పద్మారావునగర్‌లోని ఇంటిని తానే కొంటానంటూ అతను ముందుకొచ్చాడు.
Anjireddy Murder Case Latest Update :రూ.4 కోట్ల విలువైన ఇంటిని వీలైనంత తక్కువకు దక్కించుకోవాలని రాజేశ్ పథకం వేశాడు. దాన్ని అమలు చేసేందుకు ముందస్తు ప్రణాళికను వేసుకున్నాడు. పరిచయమైన నాటి నుంచి అంజిరెడ్డి ఇంటికి ప్రతిరోజూ రాజేశ్ వెళ్లేవాడు. ఇంటి కొనుగోలుకు అవసరమైన డబ్బంతా సిద్ధంగా ఉందంటూ మాట్లాడేవాడు. ఒక రోజు రూ.50లక్షలు, మరుసటి రోజు కోటి ఇవ్వబోతున్నట్టు మృతుడి భార్యకు వినిపించేంత పెద్దగా చెబుతుండేవాడు.
Producer Anji Reddy Murder Case :తన పథకం సఫలమైతే తాను డబ్బులిచ్చినట్టు అంజిరెడ్డి భార్య ద్వారానే సాక్ష్యం చెప్పించాలనే ఆలోచనతో.. రాజేశ్ ఇదంతా చేసినట్టు పోలీసుల ఎదుట నిందితుడు వెల్లడించినట్టు తెలుస్తోంది. తనపై పూర్తి నమ్మకం కుదిరినట్టు నిర్ధారించుకున్నాక.. అంజిరెడ్డిని హత్య చేయాలని అతను భావించాడు. గత నెల 29న మధ్యాహ్నం అంజిరెడ్డికి ఫోన్ చేసిన రాజేశ్.. సికింద్రాబాద్ రెజిమెంటల్‌బజార్‌లోని జీఆర్ కన్వెన్షన్ హాలుకు రావాలని కోరాడు.