Cine Celebrities In Drugs Case : డ్రగ్స్ కేసులో కబాలి నిర్మాత అరెస్టు కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ఫుల్ ఫోకస్ పెట్టిన తెలంగాణ పోలీసులు.. ఇటీవలే డ్రగ్స్ కేసులో రోషన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి ఫోన్‌లో లభించిన ఆధారాలతో కేపీ చౌదరి ప్రమేయాన్ని ఛేదించారు. గత ఏడు సంవత్సరాలుగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లోని పలువురితో అతడికి సంబంధాలున్నాయి. గోవా, హైదరాబాద్ శివారు ఫామ్‌హౌస్‌ల్లో కేపీ చౌదరి ఏర్పాటు చేసే ప్రైవేటు పార్టీలకు పలువురు నటులు హాజరైనట్టు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. :కేపీచౌదరి గోవాలో హోటల్ ప్రారంభించినప్పుడు నైజీరియన్లతో ఇతనికి పరిచయాలు ఏర్పడ్డాయి. వారితో పాటు అంతర్జాతీయ డ్రగ్ డీలర్లతో పరిచయాలు ఏర్పాడి వారితో సంబంధాలను బలపరుచుకున్నాడు. దాదాపు సంవత్సరకాలంగా ఏపీ, తెలంగాణకు చెందిన స్థిరాస్తి వ్యాపారులు, సినీ, రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖులు ఇతడి దగ్గర ఖరీదైన కొకైన్ కొనుగోలు చేస్తున్నారని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. 2017లో తెలుగు సినీ పరిశ్రమను మాదకద్రవ్యాల అతలాకుతలం చేసింది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్టుమెంటు అధికారులు ప్రముఖ నటీ నటులను కార్యాలయానికి రప్పించి విచారణ జరిపారు. ఇన్ని సంవత్సరాలకు నైజీరియన్ల మత్తు దందాతో సినీ పరిశ్రమకు లింకులున్నట్టు ఆధారాలు బయటపడటం కలకలం సృష్టిస్తోంది.
Film Celebrities in Hyderabad Drugs Case : నైజీరియన్ పెటిట్ ఎబ్యూజర్ అలియాస్ గాబ్రియేల్ పట్టుబడితే మాదకద్రవ్యాల కేసులో ఇంకా ఎవరెవరితో లింకులు ఉన్నాయో అవన్ని బయడపతాయంటున్నారు సైబరాబాద్ పోలీసులు. ఇతడి నుంచి కొకైన్ కొనుగోలు చేసి నగరంలో సరఫరా చేస్తున్న సభ్యుల్లో నలుగురు అరెస్టయ్యారని పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి 9 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లలో లభించిన కాల్‌డేటా ఆధారంగా కొనుగోలుదారుల పూర్తివివరాలు రాబడుతున్నారు. వాట్సాప్ ద్వారా జరిగిన లావాదేవీలను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన ఈ ఫోన్లలో ఎవరెవరు ఉన్నారనేది ఆసక్తి రేపుతోంది. కేపీ చౌదరి ఫోన్లలో సినీ రంగానికి చెందిన ఇద్దరు హీరోయిన్లు, నలుగురు నటీమణులు, ప్రముఖ దర్శకుడి ఫోన్ నంబర్లు, చిత్రాలను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. గతంలో చేసినట్టుగా నోటీసులిచ్చి వదిలేయకుండా పక్కా ఆధారాలతో ప్రముఖులనూ అరెస్ట్ చేయాలనే ఆలోచనలో పోలీసులున్నారు.