దేశంలో మరో పెద్ద సమస్య వచ్చి పడింది. కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ మిడతల దండు వణికిస్తోంది. లక్షల సంఖ్యలో పంటపొలాలపై దాడి చేస్తున్నాయి. పాకిస్థాన్ నుంచి రాజస్థాన్‌లోకి, అక్కడి నుంచి రోజుల వ్యవధిలో ఒక్కో రాష్ట్రంలోకి ‘వాయు’వేగంతో తరలి వస్తున్న మిడతలు ఇప్పుడు తెలంగాణకూ చేరువవుతున్నాయి. వీటిని అలాగే వదిలేస్తే పంటనష్టం, దుర్భిక్షం తప్పదని ఇతర దేశాల్లోని పరిణామాలు రుజువు చేస్తున్నాయి. దీంతో రైతుల్ని అప్రమత్తం చేయడంపై రాష్ట్రాలు తక్షణం దృష్టి సారించాయి. తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
రాష్ట్రాన్ని సమీపిస్తున్న మిడతల దండు!
యూపీ ప్రభుత్వం 17 జిల్లాలను అప్రమత్తం చేసింది. పెద్దఎత్తున రసాయనాలను జల్లించేందుకు సిద్ధమవుతోంది. రాజస్థాన్ గతంలోనూ అనేకసార్లు ఇలాంటి దాడుల్ని ఎదుర్కొన్నా ఈసారి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇళ్లలోకి పెద్ద సంఖ్యలో చేరుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి.
- మిడతలు మూడు నెలల్లో తమ సంతతిని 20 రెట్ల వరకు పెంచుకుంటాయి.
- ఒక పెద్ద మిడత రోజూ తన బరువుకు సమానమైన తిండి తింటుంది. ఓ 10 ఏనుగులు, 25 ఒంటెలు, లేదా 2,500 మంది మనుషులు ఒకరోజులో తినే ఆహారాన్ని ఓ చిన్నస్థాయి గుంపు తినేస్తుంది.
- ఒక చదరపు కి.మీ. దండులో 8 కోట్ల వరకు మిడతలు ఉంటాయి. మనదేశంలో కనిపించిన దండు గరిష్ఠంగా 1500 చదరపు కి.మీ. లోపే ఉంటే గతంలో అమెరికాలో 5 లక్షలకు పైగా చ.కి.మీ. విస్తీర్ణంలోనూ కనిపించాయి.
- గాలి వేగాన్ని బట్టి ఇవి రోజుకు సుమారు 135- 150 కి.మీ. వరకు ప్రయాణిస్తాయి.
- ఎడారి మిడతలు అత్యంత విధ్వంసకరమైనవని ‘ఆహారం- వ్యవసాయ సంస్థ’ (ఎఫ్‌ఏఓ) చెబుతోంది.
వాతావరణ మార్పులే కారణం
గతేడాది వర్షాకాలం దీర్ఘకాలం కొనసాగడం, హిందూ మహాసముద్రంలో తరచూ తుపాన్లు చెలరేగడం వీటి సంఖ్య భారీగా పెరిగేందుకు ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. వర్షాల కారణంగా బంజరు భూముల్లో పచ్చదనం పెరిగి మిడతల అధిక పునరుత్పత్తికి దోహదం చేసింది. మిడతల సంచారంపై రైతులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
జులైలో సమస్య మరింత తీవ్రం!
మిడతల దండు వల్ల పశ్చిమ రాష్ట్రాల్లో పంటలకు నష్టం వాటిల్లవచ్చని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ హెచ్చరించింది. ఎడారి మిడతలు ఈసారి భారీగా వచ్చాయని వన్యప్రాణి విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్ దాస్‌గుప్తా తెలిపారు. వ్యవసాయ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ బెడదను నిర్మూలనపై దృష్టి సారించాయని చెప్పారు. ఇరాన్, పాకిస్థాన్‌లలోని మిడతలు సంతానాన్ని వృద్ధి చేసుకునే కాలం కావడంతో జులై ఆరంభంలో సమస్య మరింత తీవ్రతరం అవుతుందని మరో అధికారి అంచనా వేశారు.
27 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు
వ్యవసాయ రంగంలో వచ్చిన కొత్త సాంకేతిక పరిజ్ఞానం, చీడపీడల నివారణలో వచ్చిన కొత్త పద్ధతుల వల్ల 2011 డిసెంబర్ నుంచి భారత్‌లో మిడతల ప్రభావం పెద్దగా లేదు. మళ్లీ ఇప్పుడు వాటి ఉద్ధృతి ప్రమాదకరంగా ముంచుకొచ్చింది. దాదాపు 200 ఏళ్ల నుంచి వీటిని మన దేశం చూస్తున్నా, ఇంతటి తీవ్రస్థాయిలో దండెత్తడం మాత్రం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. రాజస్థాన్ నుంచి మొదలుపెట్టి గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రల వరకు ఇవి ఇప్పటికే విస్తరించాయి.
మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోకి ప్రవేశించే అవకాశం
మహారాష్ట్రను ఆనుకుని ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, భూపాలపల్లి జిల్లాల్లోకి మిడతలు ప్రవేశించే అవకాశాలున్నాయని అధికారుల అంచనా. జిల్లా వ్యవసాయాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించాలని కలెక్టర్లకు రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి లేఖలు రాశారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, ఈ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.
- ఖాళీడబ్బాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా పెద్ద శబ్దాలు చేస్తే మిడతలు చెదిరిపోతాయి.
- ప్రతి 15 లీటర్ల నీటిలో 45 మిల్లీలీటర్ల వేపనూనెను కలిపి పైరుపై చల్లితే ఇవి తినలేవు.
- క్వినాల్‌ఫాస్ 1.5 శాతం డీపీ లేదా మిథైల్ పారథియాన్ 2 శాతం డీపీ రసాయన పొడిని హెక్టారుకు 25 కిలోల చొప్పున చల్లాలి.
- ఖాళీ ప్రదేశాల్లో ఇవి వాలితే మలాథియాన్ 96 శాతం యూఎల్‌వీ లేదా ఫెనిథ్రోథియాన్ 96 శాతం యూఎల్‌వీ రసాయనమందును హెక్టారుకు లీటరు చొప్పున నీళ్లలో కలిపి చల్లాలి.
ఇదీ చూడండి :మటన్ వ్యాపారి ఇంట పార్టీ.. 22 మందికి కరోనా