తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Teachers Transfer : రాష్ట్రంలో 50 వేల మంది టీచర్లకు బదిలీ - Teachers Transfer in Telangana news

Telangana Teachers Transfer : తెలంగాణ టీచర్లకు ఇటీవలే ప్రభుత్వం గుడ్​న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. బదిలీలతో పాటు పదోన్నతులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే రాష్ట్రంలోని గవర్నమెంట్ టీచర్లలో దాదాపు 50 శాతం మంది బదిలీ కానున్నారు. అంతేకాకుండా పదోన్నతులు దక్కనున్న మరో 9,700 మందికి కూడా బదిలీ ఉంటుందని అధికారులు తెలిపారు.

Telangana Teachers Transfer
Telangana Teachers Transfer

By

Published : Jan 28, 2023, 8:55 AM IST

Telangana Teachers Transfer : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో దాదాపు సగం మంది బదిలీ కానున్నారు. మొత్తం 26 వేల పాఠశాలల్లో సుమారు 1.04 లక్షల మంది పనిచేస్తుండగా.. వారిలో 50 వేల మందికి బదిలీ అవుతుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఉపాధ్యాయుల్లో తప్పనిసరి బదిలీ కిందే 25 వేల మంది ఉన్నారు. ఒక పాఠశాలలో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తిచేసిన ఉపాధ్యాయులు, అయిదేళ్ల సర్వీసు పూర్తయిన ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేస్తారు.

Telangana Teachers Transfer update : మిగిలిన వారు ఒకేచోట రెండేళ్లు పనిచేస్తే బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కేటగిరీలో మరో 25 వేల మంది వరకు ముందుకొస్తారని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బదిలీ అయ్యే ఉపాధ్యాయుల సంఖ్య 30 వేలు ఉండొచ్చని ఇంతకుముందు అంచనా వేయగా.. ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా పదోన్నతులు దక్కనున్న మరో 9,700 మందికి కూడా బదిలీ ఉంటుంది.

ఒక్క విద్యార్థి కూడా లేని ప్రభుత్వ పాఠశాలలు (‘జీరో’ బడులు) రాష్ట్రవ్యాప్తంగా 1,075 ఉన్నాయి. వాటికి ఇప్పటివరకు ఉపాధ్యాయ పోస్టును కేటాయిస్తూ వచ్చారు. అయితే అక్కడి టీచర్‌ను అదే మండలంలోని మరో పాఠశాలలో సర్దుబాటు చేసేవారు. ఈసారి ఆ పాఠశాలలకు పోస్టులను మంజూరు చేయడం లేదు. పోస్టు ఇచ్చి.. మళ్లీ మరోచోట సర్దుబాటు చేయడం ఎందుకని విద్యాశాఖ ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

బదిలీల ప్రక్రియలో తొలిరోజు (శుక్రవారం) ఆయా జిల్లాల్లో ఉపాధ్యాయుల తాత్కాలిక ఖాళీల సంఖ్యను డీఈవోల వెబ్‌సైట్లో ఉంచారు. వాటిపై సర్వీస్‌ రిజిస్టర్లతో పోల్చి తుది జాబితాను ప్రకటిస్తారు. జిల్లాల వారీగా స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి హెచ్‌ఎంగా, ఎస్‌జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతికి తాత్కాలిక సీనియారిటీ జాబితాను ప్రకటించారు. మరోవైపు బదిలీల మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ అధికారులు, మంత్రికి వినతిపత్రాలు అందజేశాయి.

స్పౌజ్‌ బదిలీలతో మోదం.. ఖేదం.. రాష్ట్రంలో 12 జిల్లాల్లో 427 స్పౌజ్‌ బదిలీలు జరగనున్న సంగతి తెలిసిందే. సంవత్సరకాలంగా సుమారు 2,100 మంది ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు ప్రభుత్వం కొందరికి అనుమతి ఇచ్చింది. దాంతో వారు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు వారి బదిలీల వల్ల సిద్దిపేట, మేడ్చల్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, హనుమకొండ, రంగారెడ్డి, వరంగల్‌, మంచిర్యాల, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఉపాధ్యాయుల పదోన్నతుల్లో కోత పడనుంది. అంటే 427 మందికి పదోన్నతులు పోయినట్లేనని చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో గణితం, భౌతికశాస్త్రం, ఆంగ్లం సబ్జెక్టుల్లో ఒక్కరికి కూడా పదోన్నతి రాదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో స్పౌజ్‌ ఉపాధ్యాయులు ఇప్పటివరకు పనిచేసిన 19 జిల్లాల్లో పలువురికి పదోన్నతులు దక్కుతాయని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details