కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. 2005లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రూ. 17,895 కోట్ల అంచనా వ్యయం.... 12.2 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించారని పద్మనాభరెడ్డి తెలిపారు. మొదట్లో ఎకరాకు అయ్యే ఖర్చు రూ. 1.46 లక్షలుగా లెక్కగట్టారని... ఆ తర్వాత క్రమంగా అంచనా వ్యయం పెరుగుతూ వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
2018-19 లోపు ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్నారని... ఆ లోపే సాగునీటి విస్తీర్ణాన్ని 16.4 లక్షల ఎకరాలకు పెంచి అంచనా వ్యయాన్ని రూ. 40,300 కోట్లకు పెంచారని పద్మనాభరెడ్డి తెలిపారు. ఎకరాలకు అయ్యే ఖర్చు కూడా రూ. 1.46 లక్షల నుంచి 2.45 లక్షలకు పెరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక రీడిజైన్ పేరుతో పెద్దఎత్తున మార్పులు చేశారని.... 18.25 లక్షల ఎకరాలకు సాగునీటి అందించేలా రూ. 80, 910 కోట్లతో ప్రాజెక్టు అంచనా వ్యయం రూపొందించారని... ఇప్పటికే రూ. 61,740 కోట్లు ఖర్చు చేశారని పద్మనాభరెడ్డి తెలిపారు.