charging stations for electric vehicles : రాష్ట్రంలో విద్యుత్ వాహనాల కోసం మరిన్ని ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం నగరంలో 70 ఛార్జింగ్ స్టేషన్లుండగా మరో 118 ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విద్యుత్ వాహనదారులకు అందుబాటులో ఉండటమే కాదు చిరువ్యాపారులు తమ వద్ద వీటిని ఏర్పాటు చేసుకుని అదనపు ఆదాయం పెంచుకునేలా వెసులుబాటు కలగనుంది. మహానగరంలో విద్యుత్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. దీంతో ఛార్జింగ్ స్టేషన్లకు డిమాండ్ ఏర్పడింది.
ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు..
నగరవ్యాప్తంగా సింగిల్ ఛార్జర్ ఉండే పాయింట్ల ఏర్పాటుకు రెడ్‌కో అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు ఉపయోగపడేలా 3 కిలోవాట్ సామర్థ్యంతో ఇవి పనిచేయనున్నాయి. 2-3 కిలోవాట్ల సామర్థ్యంతో ద్విచక్ర వాహనాలు 60 కి.మీ. నుంచి 100 కి.మీ. వరకు ప్రయాణిస్తాయి. ఒక కిలోవాట్ సుమారు రూ.6 ఖర్చు అవుతుంది. వాహనానికి ఛార్జింగ్ చేసే యూనిట్లు.. వాహన సామర్థ్యం ఆధారంగా వారి లాభాలు కలుపుకొని రుసుము వసూలు చేసుకోవచ్చు. ఒక్కో ఛార్జింగ్ పాయింట్‌కు రూ.15 వేల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. దీంతో మున్ముందు హోటళ్లు, కిరాణా దుకాణాలు, పాన్‌షాపుల వద్ద ఇవి ఎక్కువ సంఖ్యలో కనిపించనున్నాయి.