Fever Survey in Telangana: రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే ప్రారంభమైంది. వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటింటా జ్వర సర్వే నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో వైద్యారోగ్య శాఖ సిబ్బందితో పాటు గ్రేటర్ అధికారులు సైతం సర్వేలో పాలుపంచుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో సర్కిల్ వారీగా ఆశా వర్కర్లు, జీహెచ్ఎంసీ సిబ్బందిని విభజించి ఈ సర్వేలు చేపడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబసభ్యుల వివరాలతో పాటు.. ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు , గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉన్నాయా లేదా అని పరిశీలిస్తున్నారు. లక్షణాలు ఉన్నవారికి వెంటనే టెస్టులు నిర్వహించి.. అప్పటికప్పుడే ఔషధ కిట్లు అందజేస్తున్నారు.
"ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బందిని గ్రూపులుగా విభజించి గ్రేటర్లో కాలనీలకు కేటాయించాం. మొత్తం 250 మంది ఉద్యోగులు ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేలో లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే టెస్టులు నిర్వహించి కిట్లు అందిస్తున్నాం." -- దామోదర్ రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారి
కోటి కిట్లు
కోటి ఔషధ కిట్లను ఇప్పటికే అన్ని ఆస్పత్రులకు అధికారులు పంపించారు. కిట్‌లో అజిత్రోమైసిన్, పారాసిటమాల్, లెవో సిట్రిజన్, రానిటిడైన్, విటమిన్-C, మల్టీ విటమిన్, విటమిన్-D మందులు అందజేస్తున్నారు. నాలుగైదు రోజుల్లో జ్వర సర్వే పూర్తయ్యేలా అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది.
"కొన్ని గేటెడ్ కమ్యూనిటీ విభాగాల్లో మా సిబ్బందిని లోపలికి అనుమతించడం లేదు. వారి వివరాలు తీసుకుంటున్నాం. ప్రజల అనుమతి లేనిది బలవంతంగా సర్వే నిర్వహించలేం. వారి ఇంటి నెంబరు తీసుకుని స్థానిక రాజకీయ నాయకుల సాయంతో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాం. కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించి హౌం ఐసోలేషన్ కిట్లు అందజేస్తున్నాం." -- సంధ్య, చింతల్ బస్తీ వైద్యాధికారి
ఎప్పటికప్పుడు అప్రమత్తం
ఇటీవల కేబినెట్ భేటీలో కరోనా కట్టడి చర్యలపై విస్తృతంగా చర్చించారు. రెండు కోట్ల కొవిడ్ కిట్‌లను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జ్వర సర్వేతో పాటు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించగా.. ఎప్పటికప్పుడు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వివరాలు తెలుసుకుంటున్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్వల్ప లక్షణాలు ఉన్నవాళ్లు ఇంటివద్దే ఉంటూ ప్రభుత్వం అందించే కిట్‌లోని మందులను వాడుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:Hospital Charges For Covid Treatment : కాక్‌టెయిల్ పేరు చెప్పి ఆస్పత్రుల దోపిడీ