తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపాసన దత్తత తీసుకున్న గజరాణి కన్నుమూత - ఉపాసన దత్తత తీసుకున్న గజరాణి కన్నుమూత

హైదరాబాద్​ నెహ్రూ జూపార్కులోని ఆడ ఏనుగు గజరాణి కన్నుమూసింది. ఈ ఏనుగును గతేడాది జులై 20న రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన దత్తత తీసుకున్నారు.

elephant died
elephant died

By

Published : Jun 10, 2021, 12:14 PM IST

నెహ్రూ జూపార్కులోని ఆడ ఏనుగు గజరాణి (83) వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా బుధవారం మృతి చెందింది. నిజాం కాలం నాటి ఏసియాటిక్‌ జాతికి చెందిన రాణి ఏనుగు జూలో గజరాణిగా ప్రసిద్ధి చెందింది. నగరంలోని సంప్రదాయ కార్యక్రమాలు, ఉత్సవాలు, మొహర్రం, బోనాల ఊరేగింపులో చాలా ఏళ్లు ఇది పాల్గొంది. 1938 జులై 7న జన్మించిన రాణి ఏనుగు తొలుత నిజాం పాలకులు నిర్వహించిన నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌లోని బాగే ఆమ్‌ జంతు ప్రదర్శనశాలలో ఉంది. 1963 అక్టోబరు 1న దీన్ని నెహ్రూ జూలోకి తరలించారు. ఏనుగులు సాధారణంగా 60 ఏళ్లపాటు జీవిస్తాయని, రాణి ఏనుగు 83 ఏళ్లు జీవించడం విశేషమని జూ అధికారులు తెలిపారు. ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డులోని ఏసియాటిక్‌ ఆడ ఏనుగు చెంగళూరు దాక్షాయణి, లీన్‌వంగ్‌లోని మగ ఏనుగు 86 ఏళ్లు జీవించాయి. 83 ఏళ్లు జీవించిన రాణికి ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవించిన ఏనుగుల్లో మూడో స్థానం లభించింది. ఈ ఏనుగును గతేడాది జులై 20న రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన దత్తత తీసుకున్నారు. రాణి మృతి చెందడంతో ప్రస్తుతం ఆడ ఏనుగులు వనజ, ఆశ, సీతలతో పాటు మగ ఏనుగు విజయ్‌ ఉన్నట్లు జూ క్యూరేటరు వీవీఎల్‌ సుభద్రాదేవి తెలిపారు.

21 ఏళ్ల చిరుత కూడా...

జూలోని అయ్యప్ప అనే మగ చిరుత వృద్ధాప్యం వల్ల బుధవారం మృతి చెందింది. 21 ఏళ్ల అయ్యప్ప 2000 జూన్‌ 16న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్‌ పార్కులో జన్మించింది. చిరుత సంతతి రక్తమార్పిడిలో భాగంగా ఇక్కడి నెహ్రూ జూకు అయ్యప్పను తీసుకువచ్చారు. చిరుతలు సాధారణంగా అడవుల్లో 15 ఏళ్లు మాత్రమే జీవిస్తాయని, జూలో ప్రత్యేకంగా అందించే ఆహారం, పశువైద్యుల పర్యవేక్షణ కారణంగా అయ్యప్ప మరో ఆరేళ్లు ఎక్కువ జీవించిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details