అగ్నిప్రమాదాలు@కార్లు
భయపెడుతున్న షి'కారు' - FIRE
నడుస్తున్న కారులో ఉన్నట్టుండి మంటలు చేలరేగుతున్నాయి. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కార్లు కళ్లముందే బూడిదవుతున్నాయి. ఒక్కోసారి ఆ మంటల్లోనే వాహనదారులూ చిక్కుకుపోతున్నారు. మరి ఆ ప్రమాదాల నుంచి బయట పడేదెలా..?
కారు ప్రయాణాల్లో తరచూ అగ్నిప్రమాదాలు జరగడం వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఊహించని విధంగా చోటు చేసుకుంటున్న ప్రమాదాల్లో ఒక్కోసారి ప్రయాణీకులు సైతం సజీవ దహనమైపోతున్నారు. తాజాగా అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ వద్ద బాహ్యవలయ రహదారిపై కారుతోపాటు అందులోని వ్యక్తి సజీవ దహనమయ్యాడు.
నిర్వహణ లోపాల వల్లే..!
కార్ల నిర్వాహణ సక్రమంగా లేకపోవడం, నాసిరకం విడిభాగాలు వాడడం, అధీకృత సంస్థలు రూపొందించే గ్యాస్ కిట్‌లు వాడకపోవడం లాంటి కారణాల వలన అగ్ని ప్రమాదాలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
దూర ప్రయాణాలు చేసే ముందు తమ వాహనాలను నిపుణులతో పరీక్షించి... వారి సూచనలు పాటించడం వలన ప్రమాదాల బారిన పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు.
అవగాహన అవసరం...!
హంగులు ఆర్భాటాలకు పోకుండా వాహనాల పట్ల అవగాహన కలిగి ఉండటం. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిసి ఉండటంతోపాటు కొంత సమయ స్ఫూర్తి పాటించటం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.