అడవులు, పర్యావరణ రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అటవీ విద్యను ప్రోత్సహించాలన్న సంకల్పంతో తమిళనాడు మెట్టుపలాయం అటవీ కళాశాలకు దీటుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో 2015లో ఆటవీ కళాశాల ప్రారంభమైంది. 2016లో బీఎస్సీ ఫారెస్ట్రీ మొదటి బ్యాచ్ నాలుగేళ్ల కోర్సుతో ప్రారంభమైంది. ఈ యేడాదే ఫైనల్ ఇయర్ విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసుకుంటున్నారు. ముందుగా దూలపల్లి ఫారెస్ట్ అకాడెమీలో మొదలైన కళాశాల, గత డిసెంబర్ లో హైదరాబాద్ శివారు ములుగులో సొంత క్యాంపస్‌లోకి మారింది.
విజయవంతంగా మొదటి బ్యాచ్ బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును పూర్తి చేసుకుంటున్న అటవీ కళాశాల ఈ ఏడాది నుంచి రెండేళ్ల ఎంఎస్సీ ఫారెస్ట్రీతో పాటు, మూడేళ్ల పీహెచ్ డీ ఫారెస్ట్రీ కోర్సులను కూడా ప్రారంభిస్తోంది. తొలి నాళ్లలో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా బీఎస్సీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగింది. ఎంసెట్ కౌన్సిలింగ్ ఆధారంగా ప్రస్తుతం ప్రవేశాలు జరుగుతున్నాయి. బోధనలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ బ్రిటిష్ కొలంబియా, అబర్న్ యూనివర్సిటీలతో అవగాహనా ఒప్పందాలను కళాశాల కుదుర్చుకుంది.