FCI Letter to Civil Supplies Department: రావాల్సిన సొమ్మును తెచ్చుకునేందుకు అధికారులు ఆసక్తి చూపని వింత పరిస్థితి రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో నెలకొని ఉంది. తాజాగా ‘బిల్లులిచ్చి నిధులు తీసుకోండి’ అంటూ భారత ఆహార సంస్థ తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుపై బ్యాంకుల నుంచి పౌరసరఫరాల సంస్థ అప్పు తీసుకుని ధాన్యం కొనుగోలు చేస్తుంది. ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చిన తరవాత ఎఫ్‌సీఐ నిధులు విడుదల చేస్తుంది. 2019-20, 2020-21 వ్యవసాయ సీజన్లకు సంబంధించి 15.70 లక్షల క్వింటాళ్ల బియ్యం బిల్లులు ఎఫ్‌సీఐకి అందలేదు. ఆ బియ్యం విలువ రూ.500 కోట్లపైనే ఉండటం విశేషం.పెండింగులో ఉన్న బిల్లులన్నింటినీ డిసెంబరు 15వ తేదీలోగా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ అధికారులను ఆదేశించింది. ఆ మేరకు ఎఫ్‌సీఐ అధికారులు దస్త్రాలను పరిశీలిస్తే 2019-20 నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు వరకు పౌరసరఫరాల సంస్థకు సంబంధించి పెద్ద మొత్తంలో బిల్లులు పెండింగులో ఉన్నట్లు తేలింది. ఎప్పుడెప్పుడు బియ్యం అందజేశారు? బిల్లులు పెట్టనవి ఎన్ని? తదితర వివరాలతో ఎఫ్‌సీఐ అధికారులు నివేదిక రూపొందించారు. ఆ వివరాలతో తాజాగా లేఖ రాశారు. పెండింగులో ఉన్న బిల్లులను అందచేస్తే నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అందులో పేర్కొన్నారు.
FCI Letter: పౌర సరఫరాల శాఖకు ఎఫ్‌సీఐ లేఖ.. ఎందుకంటే?
FCI Letter to Civil Supplies Department: 'ఆ బిల్లులేదో మాకు ఇచ్చేసి.. నిధులు తీసుకుపోండి' అంటూ పౌర సరఫరాల శాఖకు ఎఫ్‌సీఐ లేఖ రాసింది. ఎప్పుడెప్పుడు బియ్యం అందజేశారు? బిల్లులు పెట్టనవి ఎన్ని? తదితర వివరాలతో ఎఫ్‌సీఐ అధికారులు నివేదిక రూపొందించారు. కానీ పౌర సరఫరాల శాఖ మాత్రంపై నిధులపై ఏ మాత్రం ఆసక్తి చూపించట్లేదని తెలుస్తోంది.
రాష్ట్రంలోని 21 జిల్లాల పరిధిలో బిల్లులు పెండింగులో ఉన్నట్లు గుర్తించారు. సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, నల్గొండ, యాదాద్రి జిల్లాలో వందల లోడులకు సంబంధించిన బియ్యం బిల్లులను అధికారులు ఇవ్వాల్సి ఉంది. ఇటీవలి కాలంలో కొనుగోలు కేంద్రాల ఖరారు నుంచి మిల్లులకు ధాన్యం కేటాయింపుల వరకు పలు అంశాల్లో పౌరసరఫరాల శాఖలో వేగం సన్నగిల్లినట్లు ప్రచారం సాగుతోంది. గోనె సంచుల టెండర్ల ఖరారులోనూ ఇదే పోకడ కనిపించిందన్నది చర్చనీయాంశంగా ఉంది. అధికారుల చేయాల్సిన పనులపై కూడా పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అప్రమత్తం చేస్తూ లేఖలు రాసిన సందర్భాలు తరచూ ఉంటున్నాయని తెలుస్తోంది.
ఇదీ చూడండి:Crop Loans: తగ్గిన పంట రుణాలు... వరి వద్దని చెప్పడమే కారణమంటున్న బ్యాంకర్లు