బియ్యం నిల్వ సమస్యలకు చెక్ రాష్ట్రంలో బియ్యం నిల్వ చేయడంలో వస్తున్న సమస్యలు అధిగమించేందుకు భారత ఆహార సంస్థ, తెలంగాణ పౌర సరఫరాల శాఖ సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. రైస్ మిల్లులో మిల్లింగ్ చేసిన బియ్యం గోదాముల్లో నిల్వ చేయకుండా... నేరుగా కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్‌కార్ ద్వారా ఇతర రాష్ట్రాలకు రవాణా చేయాలని నిర్ణయించాయి. దీన్ని దేశంలోనే మొదటిసారి అమలులోకి తెచ్చారు. శనివారం ప్రయోగాత్మకంగా సంగారెడ్డి జిల్లా నుంచి 2500 మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కేరళ రాష్ట్రం కోచి ఎఫ్‌సీఐ గోదాంకు తరలించారు.
సమస్యలు ఎఫ్‌సీఐ దృష్టికి
రాష్ట్రంలో పెరుగుతున్న వరి పంట దిగుబడులకు అనుగుణంగా బియ్యం నిల్వలకు అవసరమైన గోదాములు కేటాయించాలని పౌరసరఫరాల శాఖ ఎఫ్‌సీఐకి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. డిమాండ్‌కు అనుగుణంగా నిల్వ సామర్థ్యం లేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని... దీని వల్ల ప్రభుత్వంపై ఆర్థికంగా పెను భారం పడుతోందని తెలిపింది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ పంట కాలాల్లో 77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. రాష్ట్ర అవసరాలకు పోనూ మిగిలిన బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి అప్పగిస్తుంది. బియ్యాన్ని అప్పగించడానికి రైస్ మిల్లర్లు సిద్ధంగా ఉన్నా... ఎఫ్‌సీఐ గోదాముల్లో స్థలం చూపించకపోవడం వల్ల జాప్యం జరుగుతోంది. దీనిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ అశ్విని కుమార్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. సమస్య తీవ్రతను గుర్తించిన ఎఫ్‌సీఐ అధికారులు వ్యాగన్ ఏర్పాటుకు అంగీకరించారు.
ఇదీ చూడండి : 'ఏడాదిగా అసంతృప్తి... అందుకే ఈ నిర్ణయం'