ఓ ఇంట అబ్బాయి పుట్టినప్పుడు వారసుడు పుట్టాడని సంతోషపడతారు. అమ్మాయి పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంబరపడిపోతారు. అబ్బాయి పుట్టినప్పుడు బయటకెళ్లి అందరితోనూ అరె నాకు వారసుడు పుట్టాడ్రా.. అని చెప్పుకునే తండ్రి... అమ్మాయి పుడితే కూతుర్ని వదిలి బయటకు వెళ్లడు. తనకే తెలియకుండా తన కంటి 'పాప' దగ్గరే కూర్చుండిపోతాడు. తన మోమును చూస్తూ... చిట్టి చిట్టి పాదాలను తాకుతూ.. కోమలమైన చేతులతో ఆడుకుంటూ. బోసి నోరుతో కేరింతలు కొడుతున్న నవ్వుల్లో లీనమైపోయి తాను తండ్రిని అయ్యాననే సంగతే మరచిపోయి పసివాడైపోతాడు. తనతో పసివాడిలా ఆడుకుంటున్న తండ్రిని చూసి ఆ పసిపాప పురిటి మంచంపైనే ఉరకలు వేస్తూ రెట్టించిన ఉత్సాహంతో ఆడుకుంటుంది. పైకి ఎంత గంభీరంగా కనిపించే వ్యక్తి అయినా తన కూతురు దగ్గర పసివాడే.
ఓ వ్యక్తికి ఎంత సంపాదించినా రాని ఆనందం తన గారాలపట్టికి ఓ చిన్న బహుమతి ఇస్తే ఎంతో సంతోషం పడటం మనం చూస్తుంటాం.. కాళ్లకు పట్టీలు పెట్టుకుని.. పట్టుపరికిణి వేసుకుని కేరింతలు కొడుతూ నట్టింట తిరుగుతున్న కూతురు... వీధి గుమ్మంలో తాను కనబడగానే నాన్నగారు అంటూ ఎదురొస్తుంటే... ఎంత ఒత్తిడి ఉన్నా క్షణంలో మాయమైపోతుంది. కూతురుకి ఏమాత్రం నలత చేసినా.. కాస్తంత అవసరమొచ్చినా.. తండ్రి హృదయం తల్లడిల్లిపోతుంది. తన కంటి దీపం నయనాల్లో చిన్న నీటి పొరను చూడగానే రుద్రుడైన శివుడు కూడా మంచులా కరిగిపోతాడనడంలో అతిశయోక్తి లేదు.
పురిటి మంచంపై బిడ్డను చూడగానే ప్రతి వ్యక్తిలో తండ్రి పుడతాడు. తన కూతురు ప్రతి దశను దాటి ఎదుగుతున్నప్పుడు తండ్రి చిన్న పిల్లాడుగా మారతాడు. అవును నిజమే... ప్రతి కూతురికి తండ్రి ఎప్పుడూ చిన్నపిల్లాడే... మొదటిసారిగా నాన్న.... అంటూ తిరుగుతున్నప్పుడు.. తప్పటడుగు వేస్తున్నప్పుడు... అడుగు పరుగై ఇంటిని దాటి వెళ్తున్నప్పుడు.. నడక నేర్చుకున్న కూతురు మారాం చేసి సైకిల్ కొనిపిచ్చుకుని దానిపై తనని కూర్చోబెట్టుకుని నాన్నగారు.. గట్టిగా పట్టుకోండి అంటూ వేగంగా తొక్కుతూ వెళ్తున్న కూతుర్ని చూస్తూ వెనుక కూర్చున్న తండ్రి కంట వచ్చే ఆనంద బాష్పాలు వెలకట్టలేనివి.
కంటికి రెప్పలా చూసుకుంటూ గారాబం చేస్తుంటే అందరూ వచ్చి ఎందుకయ్యా ఆడపిల్లకు అంత గారాబం చేస్తావు... నీవు ఎంత చదివించినా... ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లినా ఓ ఇంట గరిటపట్టుకోవడమేగా... నిన్నేమన్నా చూస్తుందా ఏంటి... అమ్మాయిలకు ఈ చదువులు... ఆటలు ఎందుకు అంటూ ఎన్ని సూటిపోటి మాటలు అంటున్నా... వాళ్లకు మాటతో కాదు... తన కూతురు ఎదిగి ప్రయోజకురాలైన తర్వాత.... విజయగర్వంతో నవ్విన నోళ్లు మూయించాలనుకుంటాడు. అంత భద్రంగా పెంచుకున్న కూతుర్ని... తాను లేని ఇంట్లో తనకంటే భద్రంగా చూసుకునే మనుషుల మధ్యలోకి పంపాలని కోరుకుంటాడు. అందుకు తల తాకట్టు పెట్టడానికైనా వెనకాడడు.