Baby Father commits Suicide Khairatabad:ఇంట్లో బుడిబుడి నడకలతో, ముద్దుముద్దు మాటలతో తమ కళ్లెదుటే మహాలక్ష్మిలా తిరుగుతుంటే ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు.. కానీ వారి ఆనందం ఎంతోకాలం నిలువలేదు. అనారోగ్యం రూపంలో వచ్చిన మాయావి ఆ పసిపాపను ఈలోకం నుంచి శాశ్వతంగా తీసుకుపోయింది. పాప మరణం ఆమె తండ్రిని తీవ్రంగా కలచివేసింది. కూతురు ఇకలేదని తెలుసుకొని ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
పోలీసులు, స్థానికులు అందించిన సమాచారం ప్రకారం మృతుడు కిషోర్ ఖైరతాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఆరాధ్య అనే ఓ ఐదేళ్ల పాప ఉంది. ఆ పసితల్లిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. బుడిబుడి అడుగులతో, తమ కుమార్తె వచ్చిరాని మాటలకు ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందపడ్డారు. కాని విధి ఆడిన ఆట వారికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఆరాధ్యకు ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. రెండు నెలల నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతోంది. ఎన్నిఆసుపత్రులు తిప్పినా ఫలితం లేకపోయింది. అనారోగ్యంతో పోరాడుతూ ఆ పసిపాప రెండురోజుల క్రితం శాశ్వత నిద్రలోకి జారుకొంది.
Father Commits Suicide due to Death of Baby :తమ గారాల పట్టి ఇక రాదని తెలుసుకొని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తన చేతుల్లో అల్లారుముద్దుగా పెరిగిన తన ప్రాణానికి ప్రాణంగా భావించే కన్న కూతురు మరణం ఆ తండ్రిని తీవ్రంగా మానసిక క్షోభకు గురిచేసింది. కూతురు మరణాన్ని జీర్ణించుకోలేని ఆ పసిపాప తండ్రి కిషోర్ ఖైరతాబాద్‌లోని రైలు పట్టాలపై అదే రోజు రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఖైరతాబాద్‌లోని ఆయన నివాసం వద్ద విషాద చాయలు అలుముకున్నాయి.