తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ కష్టాలు భరించలేం.. దివ్యాంగురాలైన కుమార్తెతో కలిసి తండ్రి ఆత్మహత్య - రైల్వే స్టేషన్​లో తండ్రికూతురు ఆత్మహత్య

Father and daughter commit suicide at Secunderabad railway station: వృద్ధాప్యం, ఒంటరి జీవితం, దీనికి తోడు దివ్యాంగురాలైన కుమార్తెకు సేవలు చేయడం.. ఆ 81 ఏళ్ల తండ్రికి తలకుమించిన భారమైంది. తానే ఒకరితో సేవలు చేయాల్సిన వయస్సులో తన కుమార్తెకు సేవలు చేయడం కష్టంగా మారింది. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు ఆ తండ్రిని నిస్సహాయుడిని చేశాయి. ఈ బతుకు బతకలేమంటూ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కూతురుతో కలిసి చివరకు భార్య వద్దకు చేరుకున్నాడు.

Father and daughter commit suicide
Father and daughter commit suicide

By

Published : Mar 8, 2023, 10:47 PM IST

Updated : Mar 9, 2023, 7:32 AM IST

Father and daughter commit suicide at Secunderabad railway station: ఓవైపు దివ్యాంగురాలైన కుమార్తె.. మరోవైపు భార్య చనిపోయిన బాధ.. ముసురుకున్న ఆర్థిక ఇబ్బందులు, దానికి తోడు భయపెడుతున్న వృద్ధాప్యం.. అవే ఆ తండ్రిని జీవితంలో కఠినమైన నిర్ణయం వైపు నడిపించాయి. ఈ కష్టాల కడలిని ఇక ఈదలేనంటూ.. ఆత్మహత్య చేసుకున్నాడు. తనొక్కడిని పోతే తన చిట్టితల్లికి దిక్కెవరు అనుకొని దివ్యాంగురాలైన ఆ కుమార్తెను కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెల్ని పిండేసిన ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.

మల్లాపూర్ ప్రాంతానికి చెందిన మల్లేష్ చారి, తన కూతురు ఉమారాణితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఏడాది క్రితం ఆరోగ్యం బాగాలేక ఆయన భార్య తనువు చాలించింది. అప్పటి నుంచి.. మల్లేష్ చారి దివ్యాంగురాలైన తన కూతురిని చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య మరణం తర్వాత ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. దీనికి తోడు మీద పడుతున్న వృద్ధాప్యం, కుమార్తెను పోషించే దారి కనిపించడం లేదు. ఆపన్న హస్తం చూపే వారు కరవయ్యారు. ఎవరిని సాయం కోరినా మొండి చేయి ఎదురైంది.

దివ్యాంగురాలైన కుమార్తెకు రోజు సేవలు చేయడం, తనను తాను పోషించుకోవడం ఆ వృద్ధ తండ్రికి భారంగా మారింది. ఈ బతుకు భారం తన వల్ల కాదంటూ మల్లేష్ చారి తన కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈరోజు మౌలాలి చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు కిందపడి తండ్రి, కుమార్తె కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైల్వే ట్రాక్​పై ఇద్దరి మృతదేహాలను చూసిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచార మిచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒకేసారి తండ్రి, కుమార్తె మరణం స్థానికులను కలిచివేసింది. ఇరువురి మరణంతో మల్లేష్ చారి స్వగ్రామం మల్లాపూర్​లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వృద్ధాప్యం, ఆర్థిక ఇబ్బందుల వల్లే ఇరువురు ఆత్మహత్య చేసుకొని ఉంటారని స్థానికులు చెబుతున్నారు. వారిని ఆదుకునేందుకు ఎవరైనా ముందుకొస్తే.. ఇంత కఠిన నిర్ణయం తీసుకునే వారు కాదని వాపోయారు.

Last Updated : Mar 9, 2023, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details