రాష్ట్రంలో జొన్న, మొక్కజొన్న పంటలు పండించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ లేదన్న సాకుతో వ్యాపారులు ధరలు బాగా తగ్గించేశారు. ప్రైవేట్ వ్యాపారులు తక్కువకు కొనుగోలు చేస్తున్నందును రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం పూచీకత్తు ఇస్తే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని జొన్న, మొక్కజొన్న కొనుగోలు చేస్తామని రాష్ట్ర మార్కెటింగ్ సమాఖ్య- మార్క్‌ఫెడ్ (Markfed) పేర్కొంది.
అనుమతులు ఏవి...
ఇలా కొన్న పంటలను కొంతకాలం తర్వాత అమ్మినప్పుడు నష్టాలు వస్తే... భర్తీ చేస్తామని ప్రభుత్వం పూచీకత్తు ఉత్తర్వుల్లో స్పష్టంగా తెలియజేయాలి. ఐదేళ్లుగా ఇలా కొన్న వివిధ పంటలను తిరిగి అమ్మినప్పుడు రూ. 2,100 కోట్ల మేర నష్టాలు వచ్చినా ఆ సొమ్మును ప్రభుత్వం తిరిగి ఇవ్వలేదు. ఆ అనుభవాల దృష్ట్యా ప్రస్తుతం మార్కెట్లకు వస్తున్న జొన్న, మొక్కజొన్నను కొనడానికి ప్రభుత్వానికి కనీసం మార్క్‌ఫెడ్ లేఖ సైతం రాయలేదు. మరోవైపు ప్రభుత్వం రైతుల సమస్యలు గుర్తించి అనుమతి ఇవ్వడం లేదు.
యాసంగి వరకు...
యాసంగి సీజన్ వరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షా 19 వేల 597 ఎకరాల్లో జొన్న సాగు చేయగా... 93 వేల టన్నుల దిగుబడి వచ్చినట్లు మార్కెటింగ్‌శాఖ ప్రభుత్వానికి నివేదించింది. మొక్కజొన్న సాగు చేయొద్దని వ్యవసాయశాఖ చెప్పినా రైతులు 4.66 లక్షల ఎకరాల్లో పంటవేయగా.. 13.07 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది.