Heavy rains in Telangana: రాష్ట్రంలో అకాల వర్షాలు రైతులను వెంటాడుతూనే ఉన్నాయి. తడిసిన ధాన్యం ఆరకముందే వరుసగా కురుస్తున్న వానలతో అన్నదాతలు ఆగమవుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షాలకు చాలాచోట్ల ధాన్యం తడిసిపోయింది. అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల వరికోతలు పూర్తై.. కల్లాల్లో ధాన్యం ఉండగా కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలకు తరలించారు. దేవరకద్ర, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రాల్లో వ్యవసాయ మార్కెట్లలో ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యం వానలకు నానిపోయింది.
కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. దేవరకద్ర, మక్తల్, వనపర్తి, గోపాల్ పేట, పెద్దమందడి, ఖిల్లాఘనపూర్ సహా వివిధ మండలాల్లో కల్లాల్లో రైతులు ఆరబోసుకున్న ధాన్యం సైతం రాత్రి కురిసిన వర్షాలకు తడిసిపోయింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురవడంతో పొల్లాల్లో వడ్లు రాలిపోయాయి. ఈదురు గాలుల ధాటికి వరిచేళ్లు నేలకొరిగాయి.
పిడుగుపాటుకు గేదెలు మృతి: ఐదు జిల్లాల్లో కలిపి ఈసారి సుమారు 5లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. కోతలు 50శాతం పూర్తికాగా, మిగిలిన విస్తీర్ణంలో కోతలు ప్రారంభం కావాల్సి ఉంది. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కురవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో పిడుగుపాటుతో 5 గేదెలు మృతి చెందాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. 10రోజుల్లోనే దాదాపు మూడుసార్లు ముంచెత్తిన వర్షాలతో కొనుగోలు కేంద్రాలు, రైతుల కల్లాల్లో ధాన్యం నీటిపాలైంది. కోతలకు సిద్ధంగా ఉన్న వరిపైరు ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి నేలవాలింది.
కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సకాలంలో కొనుగోళ్లు జరగ్గా, మిల్లుల కేటాయింపు పూర్తికాకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే నిరీక్షిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షంతో జిల్లాలోని పలుమండలాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, వైరా, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మండలాల్లో అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్లు అందుబాటులో లేకపోవటంతో ధాన్యం తడిసిపోయింది.
పంట నష్టాన్ని పరిశీలించిన కలెక్టర్: వరుసగా మూడుసార్లు ఆరబెట్టుకున్న ధాన్యం మళ్లీ తడిసిపోవటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు ధాన్యం పూర్తిగా ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు చేస్తామని కేంద్రాల్లో నిర్వాహకులు తేల్చిచెబుతుండటంతో రైతులకు మరిన్ని ఇక్కట్లు తప్పటంలేదు. ఖమ్మం జిల్లాలోని పలుమండలాల్లో కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ మధుసూధన్ పర్యటించారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటామని వారు భరోసానిచ్చారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. హనుమకొండ జిల్లా పరకాలలో ఈదురు గాలులు, వడగండ్ల వాన రైతులను దెబ్బతీసింది. వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. మామిడి, ఇతర కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. తాడ్వాయి మండలం లింగాల రైతులకు చెందిన 10పశువులు పిడుగుపాటుకు గురై మృతిచెందాయి.