TS Farmers Hopes On Crop Insurance: రాష్ట్రంలో కొన్నేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు, ప్రాజెక్టుల బ్యాక్ వాటర్ తదితర కారణాల రీత్యా పంటలు దెబ్బ తింటున్నాయి. రూ.వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు నష్టపోయిన రైతులకు సరైన ఆసరా అందడం లేదు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రంలో 2 లక్షల 80 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. అయితే నష్టం 5 లక్షల ఎకరాలకు మించి ఉండొచ్చన్న అంచనాలూ వినిపిస్తున్నాయి.
Farmers Hope Compensation For Crop: అత్యధికంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పంటలకు నష్టం జరిగింది. రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా కర్షకులు ప్రయోజనం పొందుతున్నా.. వైపరీత్యాల్లో నష్టపోయిన పంటలకు మాత్రం సాయం అందట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇస్తున్నా ఇతర పథకాలు, రాయితీలు, పరిహారం వంటి అంశాల ఊసే లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి పంట బీమా పథకం స్థానంలో ప్రత్యామ్నాయంగా మరో పథకం లేకపోవటం ప్రధాన సమస్యగా మారింది.
సమన్వయ లోపం.. రైతుల పాలిట శాపం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం రైతుల పాలిట శాపంగా మారింది. కనీసం ఇప్పటికైనా పంట నష్టపోయిన ప్రాంతాల్లో శాస్త్రీయ అంచనాలు వేసి ప్రభుత్వం తగిన పరిహారం ఇవ్వాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కవచం అంటూ మోదీ సర్కారు 2016లో ప్రధానమంత్రి పంట బీమా పథకం ప్రవేశపెట్టింది. మూడేళ్లపాటు రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేసినా.. ఆ సమయంలో జరిగిన పంట నష్టాలకు తగిన బీమా సాయం అందలేదు. దీనికి తోడు పీఎంఎఫ్‌బీవైలోని కొన్ని నిబంధనలు ప్రతిబంధకమయ్యాయి.
నిబంధనలు బీమా కంపెనీలు పాటించలేదు: వడగండ్లు, గాలుల తీవ్రత వల్ల పంట నష్టం సంభవిస్తే ఆశించిన పరిహారంలో 25 శాతం తక్షణమే చెల్లించాలన్న నిబంధనలు బీమా కంపెనీలు పాటించలేదు. రైతుల కంటే బీమా కంపెనీలకే ఈ పథకం ప్రయోజనకరంగా ఉందన్న భావన ఏర్పడటంతో ప్రీమియం చెల్లించేందుకు రైతులు ముందుకు రాలేదు. 2020లో పీఎంఎఫ్‌బీవై నుంచి వైదొలిగిన రాష్ట్ర ప్రభుత్వం.. కొత్త పథకం కోసం కసరత్తులు చేసింది. వ్యవసాయ శాఖ బృందం పశ్చిమ బెంగాల్ వెళ్లి అక్కడి పథకం తీరుపై సమగ్ర అధ్యయనం చేసినా కొత్త పథకం కార్యరూపం దాల్చలేదు.
దెబ్బతిన్న పంట నష్టంపై సీఎం ఏరియల్ సర్వే: అప్పటి నుంచి ప్రకృతి విపత్తుల సమయంలో కర్షకులు పరిహారం కోల్పోతున్నారు. ఇటీవలి వడగండ్ల వర్షాలు రైతులకు తీవ్ర ఆవేదనను మిగిల్చాయి. ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కనీసం ఈ సారైనా తమకు ప్రభుత్వం పరిహారం ఇస్తుందన్న ఆశలు రైతాంగంలో ఉన్నాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పంట నష్టంపై సీఎం ఏరియల్ సర్వే చేయనున్న నేపథ్యంలో పరిహారంపై సర్కారు వైఖరి ప్రకటించాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది.
అవసరమైతే ఈ వ్యవహారంపై అన్నదాత పక్షాన చట్టపరమైన న్యాయపోరాటానికి సిద్ధమని పలువురు నిపుణులు అంటున్నారు. నిబంధనల ప్రకారం భూమి విస్తీర్ణంలో 33 శాతానికి పైగా నష్టం జరిగితేనే పరిగణలోకి తీసుకొని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దానికి అనుగుణంగానైనా పరిహారం సత్వరం రావట్లేదని విమర్శలు ఉన్నాయి. గతేడాది వరంగల్, ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాల్లో పంట నష్టం అంచనా వేసి పరిహారం కోసం వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. అది ఇప్పటికీ రాలేదు. పంట నష్టాలకు కేంద్రం నుంచి సైతం సాయం అందట్లేదు.
ఇవీ చదవండి: