తెలంగాణ

telangana

ETV Bharat / state

విపత్తుల నుంచి కాపాడతామన్నారు.. ఇప్పుడు ముంచేస్తున్నారు!

పంట బీమా పథకం పరిహారం అందకపోవడంతో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2020-21 ఖరీఫ్ సీజన్‌ నుంచి ప్రధానమంత్రి పంట బీమా పథకం అమలు నిలిపేసిన ప్రభుత్వం.. గత రెండేళ్ల పరిహారం బకాయిలనూ చెల్లించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వాటా ధనం చెల్లించకపోవడం వల్ల బకాయిలు రూ.960 కోట్లు పేరుకుపోయాయి. ఇప్పటికే ఆర్థిక భారం కారణంగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బీమా పథకాలు అమలు కావడం లేదు. తక్షణమే పాత బకాయిలు చెల్లిస్తూ.. ప్రకృతి విపత్తుల బారినపడి కలిగే పంట నష్టాల నుంచి బయటపడేందుకు పీఎంఎఫ్‌బీవై అమలు చేసి రైతులకు అండదండగా నిలవాలని వ్యవసాయ నిపుణులు కోరుతున్నారు.

farmers waiting for crop insurances for natural disasters
విపత్తుల నుంచి కాపాడతామన్నారు.. ఇప్పుడు ముంచేస్తున్నారు

By

Published : Feb 19, 2021, 6:02 PM IST

ప్రకృతి విపత్తుల బారి నుంచి ఉపశమనం కల్పించేందుకు ఉద్దేశించిన పంట బీమా పథకం అమలుకు నోచుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2016లో దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి పంట బీమా పథకం - పీఎంఎఫ్‌బీవై అమల్లోకి వచ్చింది. అప్పట్లో ఇది రైతులకు రక్షణ కవచం అంటూ ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. కొన్ని పంటలకు మండలం యూనిట్‌గా... మరికొన్ని పంటలకు గ్రామం యూనిట్‌గా తీసుకుని అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌తో కేంద్రం ఒప్పందం కుదర్చుకుని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేసింది. బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులకు నిర్భంధ ప్రాతిపదికన రైతు వాటా బ్యాంకు రుణం మొత్తంలో మినహాయించుకుని బీమా చేశాయి.

ఆర్భాటంగా ప్రారంభించారు..

వ్యవసాయ పంట రుణాలు పొందని రైతులు, కౌలు రైతులు... కామన్ సర్వీస్ సెంటర్లు - సీఎస్‌సీలకు వెళ్లి ప్రీమియం చెల్లించారు. ఆర్భాటంగా ఈ పథకం ప్రారంభించినప్పటికీ.. అమలు లోపభూయిష్టంగా మారడంతో రైతులకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. పంట నష్టపోయి రెండేళ్లు గడిచినా ఇంత వరకూ నష్టపరిహారం అందలేదు. రాష్ట్రంలో 2018-19 సంవత్సరానికి సంబంధించి రూ.410 కోట్లు, 2019-20లో రూ.550 కోట్లు మొత్తం రూ.960 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. పీఎంఎఫ్‌బీవై పథకం కింద పెండింగ్‌లో ఉన్న బీమా పరిహారం సొమ్ము చెల్లించాలంటూ మండల వ్యవసాయ, జిల్లా అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో అన్నదాతలు రోడ్లెక్కి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనల ప్రకారమే..

నిబంధనల ప్రకారం పంటకు బీమా చేసిన మొత్తంపై వానా కాలం సీజన్‌లో ఆహార, నూనె గింజల పంటలకు రైతు వాటా కింద 2 శాతం, యాసంగి సీజన్‌లో 1.5 శాతం చెల్లించాలి. వార్షిక, వాణిజ్య, ఉద్యాన పంటలకు ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో 5 శాతం ప్రీమియం ఉంటుంది. ఇందులో రైతులు 1.5 శాతం చెల్లించాలి. మిగిలిన 3.5 శాతం ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్రాలు చెరో సగం చెల్లించాలి. మిరప పంటకు మాత్రం రైతు వాటా 5 శాతం, ఉల్లిగడ్డకు నిజామాబాద్‌లో 3.5 శాతం... మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 5 శాతం ప్రీమియం తీసుకున్నారు. ప్రధాన ఆహార పంట వరి, జొన్న, మొక్కజొన్న, సోయాబీన్, పెసర, మినుము, పసుపు, సెనగ, వేరుశనగ, మిరప, పొద్దుతిరుగుడు, ఉల్లిగడ్డ, నువ్వులు.. ఇలా 13 రకాల పంటలకు రైతులు ప్రీమియం చెల్లించారు.

వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో వరి పంట కోసం ఎకరానికి రూ.510 రూపాయలు, జొన్నకు రూ.225 రూపాయలు, పెసరకు రూ.225 రూపాయలు, వేరు శనగకు రూ.330 రూపాయలు, నువ్వులకు 180 రూపాయలు, మిరపకు 2,750 రూపాయలు చొప్పున ప్రీమియం చెల్లింపులు జరిగాయి. నిజామాబాద్ జిల్లాలో ఉల్లిగడ్డకు రూ.1050, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల రైతులు రూ.1500 చొప్పున చెల్లించారు. నాలుగేళ్లు పీఎంఎఫ్‌బీవై అమలైతే రెండేళ్లకు చెల్లించారు. మిగిలిన రెండేళ్లకు క్లైయిమ్‌లు చెల్లించలేదు.

క్లెయిమ్‌​లన్నీ పెండింగ్​లో పడ్డాయ్..

రాష్ట్ర వాటా ప్రీమియం బాకీయే ఇందుకు ప్రధాన కారణం. 2018-19 సంవత్సరంలో 7,94,322 మంది రైతులు రూ.148 కోట్ల రూపాయల వరకు ప్రీమియం రూపేణా కంపెనీలకు చెల్లించారు. దీనికి అదనంగా ప్రభుత్వాలు తమ వాటా కింద 386.74 కోట్ల రూపాయలు బీమా కంపెనీలకు చెల్లించాలి. ఇందులో కేంద్రం వాటా కింద 193.37 కోట్ల రూపాయలు చెల్లించింది. రాష్ట్రం తన వాటాగా చెల్లించాల్సిన 193.37 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. 2019-20 సంవత్సరం 10,15,200 మంది రైతులు 296 కోట్ల రూపాయలు ప్రీమియం చెల్లించారు. దానికి అనుగుణంగా ప్రభుత్వాల వాటాగా 638.40 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా కేంద్రం తన వాటా కింద 319 కోట్ల రూపాయలు చెల్లించింది. రాష్ట్రం మాత్రం తన వాటా ధనం చెల్లించలేదు. ఫలితంగా రెండేళ్ళకూ కలిపి సర్కారు తన వాటా చెల్లించాల్సిన 512.57 కోట్ల రూపాయలు చెల్లించకపోవడంతో ఆ క్లైయిమ్‌లన్నీ పెండింగ్‌లో పడ్డాయి.

చెల్లింపులపై ఆదిలాబాద్ జిల్లా రైతులు పలుమార్లు ధర్నాలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. జనవరి 18న హైదరాబాద్‌ వచ్చి వ్యవసాయ కమిషనరేట్ ఎదుట ఆందోళన చేశారు. ఒకదశలో ప్రగతి భవన్‌ ముట్టడి చేపట్టి అరెస్టయ్యారు. రైతులు ఉరితాళ్లు మెడకు చుట్టుకుని నిరసన తెలిపారు. రెండేళ్లకూ కలిపి ఒక్క ఆదిలాబాద్‌ జిల్లా పత్తి రైతులకే 269 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాల్సి ఉంది. మిగతా జిల్లాల్లో బాధిత రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారని రైతు సంఘాల నేతలు కోరారు.

ఇదీ చూడండి:పెట్రో, గ్యాస్ ధరలతో ప్రజల జీవితాల్లో చీకట్లు: చాడ

ABOUT THE AUTHOR

...view details