తెలంగాణ

telangana

ETV Bharat / state

వారి విశ్లేషణ ఆధారంగా మా కార్యాచరణ ఉంటుంది: కోదండరాం - సమగ్ర వ్యవసాయ విధానంపై అఖిల పక్ష రైతుల సమావేశం

నియంత్రిత పంట సాగు ఏ మాత్రం ఆచరణ యోగ్యం కాదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాద్ నాంపల్లి తెజస కేంద్ర కార్యాలయంలో రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో సమగ్ర వ్యవసాయ విధానంపై జరిగిన అఖిలపక్ష రైతు సంఘాల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Farmers Union Meeting
వారి విశ్లేషణ ఆధారంగా మా కార్యాచరణ ఉంటుంది: కోదండరాం

By

Published : May 23, 2020, 5:34 PM IST

రైతు సంఘాల నుంచి వచ్చిన విశ్లేషణల ఆధారంగా ఆయా సంఘాలతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించనున్నట్లు తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం అన్నారు. హైదరాబాద్​ నాంపల్లిలోని తెజస కార్యాలయంలో రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో సమగ్ర వ్యవసాయ విధానంపై అఖిలపక్ష రైతుల సంఘాల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదండరాం హాజరయ్యారు. తెలంగాణ వ్యవసాయ రంగంపై... కేంద్ర, రాష్ట్రాల నూతన విధానాల ప్రభావం, సమగ్ర వ్యవసాయ విధానం తీరుతెన్నులు, విత్తన నుంచి పంటకోత, తరలింపు, మార్కెటింగ్ వరకు ఉత్పన్నమయ్యే సవాళ్లు, ఇబ్బందులు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

పంటల పొందిక, రైతుబంధు పథకం, పంటల సేకరణ లాంటి విషయాలు రైతులను తీవ్రంగా ప్రభావితం చేయటంతోపాటు... కేంద్రం కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి చేసిన కొన్ని కీలక నిర్ణయాలు రైతులకు ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు పథకంతో ముడిపెడుతూ రూపొందిస్తున్న నియంత్రిత పంట సాగు విధానంపై పునఃపరిశీలన చేయాలని కోదండరాం సూచించారు. కార్యక్రమంలో అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, సుస్థిర వ్యవసాయ కేంద్రం కన్వీనర్ డాక్టర్ జి.రామాంజనేయులు, రైతు స్వరాజ్య వేదిక అధ్యక్ష, కార్యదర్శులు కన్నెగంటి రవి, విస్సా కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

వారి విశ్లేషణ ఆధారంగా మా కార్యాచరణ ఉంటుంది: కోదండరాం

ఇవీ చూడండి:'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'

ABOUT THE AUTHOR

...view details