తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​లో పెరిగిన అన్నదాతల ఆత్మహత్యలు - అమరావతి వార్తలు

ఏపీలో గతేడాది రైతుల ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయి. దేశవ్యాప్త జాబితాలో 2018లో నాలుగోస్థానంలో ఉన్న ఏపీ.... 2019లో 55శాతం పెరుగుదలతో మూడోస్థానానికి చేరింది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏకంగా రెండోస్థానానికి చేరింది. సొంతభూములున్న రైతుల బలవన్మరణాలూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

ఏపీలో పెరిగిన రైతుల ఆత్మహత్యలు
ఏపీలో పెరిగిన రైతుల ఆత్మహత్యలు

By

Published : Sep 2, 2020, 2:33 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 54.96% పెరిగాయి. 2018 సంవత్సరంలో 664 ఆత్మహత్యలు చోటుచేసుకోగా.. 2019లో ఆ సంఖ్య 1,029కు పెరిగింది. దేశంలోనే అత్యధికంగా రైతులు, వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డ రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత ఏపీ మూడో స్థానంలో నిలిచింది. నిరుడు ఇది నాలుగో స్థానం కావడం గమనార్హం. ఈసారి కేవలం కౌలు రైతుల ఆత్మహత్యలను పరిగణనలోకి తీసుకుంటే రెండో స్థానంలో ఉంది. జాతీయ నేర గణాంక సంస్థ మంగళవారం విడుదల చేసిన ప్రమాద మరణాలు-ఆత్మహత్యల సమాచార నివేదిక-2019 ఆందోళన కలిగించే వివరాలను వెల్లడించింది.

దేశవ్యాప్తంగా గతేడాది బలవన్మరణాలకు పాల్పడిన రైతులు, వ్యవసాయ కూలీల్లో 10.08% మంది ఏపీ వారే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. 2018తో పోలిస్తే 2019లో సొంత భూమిని సాగు చేసుకుంటున్న రైతుల ఆత్మహత్యలు 120% (199 నుంచి 438కు), కౌలు రైతుల ఆత్మహత్యలు 14.45% (166 నుంచి 190కు) పెరిగాయి.

వివరాలు..

* దేశంలో అత్యధికంగా ఆత్మహత్యలు చోటుచేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ పదో స్థానంలో ఉంది. సామూహిక ఆత్మహత్యల్లో తమిళనాడు తర్వాత రెండో స్థానంలో ఉంది.

* 2019లో ఏపీలో 6,465 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారిలో పురుషులు 4,740 మంది కాగా, మహిళలు 1,725 మంది.

* ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో అత్యధిక శాతం మంది నిరక్షరాస్యులు, పదో తరగతి లోపు చదువుకున్న వారే.

* బలవన్మరణాలకు పాల్పడ్డ 6,465 మందిలో 4,291 మంది రూ.లక్ష లోపు ఆదాయం కలిగిన వారే. రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారు 88 మందే ఉన్నారు.

* ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో వివాహితులే అధికంగా ఉంటున్నారు.

* గతేడాదిలో 383 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details