ఏపీలో 3 రాజధానుల అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... రాజధాని ప్రాంత రైతుల నిరసనలు కొనసాగిస్తున్నారు. 15 వ రోజుకు చేరిన ఈ ఆందోళనలతో... రైతులు కొత్త సంవత్సరం ప్రారంభం రోజున తమ పిల్ల పాపలతో వేడుకలకు దూరంగా ఉన్నారు. కారుణ్య మరణానికైనా తమకు అవకాశం కల్పించాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖలు రాశారు. రాజధాని తరలిపోతే తాము జీవచ్ఛవాలుగా మిగిలిపోతామని, తమకు మరణమే శరణమని లేఖలో పేర్కొన్నారు.సీఎం జగన్ నిర్ణయంతో తామంతా ఉన్నపళంగా రోడ్డున పడ్డామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
శ్మశానం అన్నందుకే... కాటికాపరి వేషంతో నిరసన
ఆందోళన చేస్తున్న వారు స్థానికులు, రైతులు కాదంటూ పలువురు నేతలు చేసిన ఆరోపణలపై మండిపడిన తుళ్లూరులోని రైతు కుటుంబాలు ఆధార్ కార్డులతో సహా ధర్నా చేశారు. అమరావతిని శ్మశానం అన్నందుకు ఓ రైతు కాటికాపరి వేషం వేసి నిరసన వ్యక్తం చేశాడు. కొత్త సంవత్సరం సందర్భంగా మహిళలు ఇళ్లముందు హ్యాపీ న్యూ ఇయర్‌కు బదులు సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే ముగ్గులు వేశారు.