*జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన రైతు గాజుల సాంబయ్య కలెక్టరేట్ ముందు ఆత్మహత్యాయత్నం చేశారు. తన 2.19 ఎకరాల సాగుభూమిని రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. సమస్యని పరిష్కరించాలంటూ వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
*ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్న తమకు భూ యాజమాన్య హక్కులు కల్పించడంలేదంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం నిమ్మగూడెం రైతులు ప్రజావాణికి తరలివచ్చి ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజి ముంపు ప్రాంత రైతులు పరిహారం కోరుతూ కలెక్టర్ భవేశ్ మిశ్రాకు వినతిపత్రం ఇచ్చారు. మొత్తం 35 దరఖాస్తులు ఇక్కడి ప్రజావాణి కార్యక్రమానికి రాగా వాటిలో 20 వరకు భూ సంబంధిత సమస్యలే ఉన్నాయి.
*సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని మధ్య మానేరు ముంపు గ్రామం శబాష్‌పల్లిని 2017లో ఖాళీ చేయించారు. పరిహారం ప్యాకేజి కింద 375 రోజులకు రూ.100 చొప్పున వ్యక్తిగత పరిహారం ఇచ్చారు. ఇతర గ్రామాల్లో రూ.175 చొప్పున ఇచ్చారని, తమకు తక్కువ ఇవ్వడంతో ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు నష్టం వాటిల్లిందంటూ ముంపు బాధితులు 300 మంది ట్రాక్టర్లపై కలెక్టరేట్‌కు తరలి వచ్చారు. త్వరలో పరిష్కరిస్తామని కలెక్టర్ అనురాగ్ జయంతి ఫోన్లో హామీ ఇచ్చారు.
*సంగారెడ్డి జిల్లాలోని గణపతి చక్కెర కర్మాగారం కార్మికులు, రైతులు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. లాక్‌అవుట్ నోటీసును ఉపసంహరించుకుని, ఫ్యాక్టరీని నడిపించేలా చూడాలని.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ ఎ.శరత్‌ను కలిసి వినపత్రం ఇచ్చారు. కొండాపూర్ మండల పరిధిలోని మునిదేవునిపల్లిలోని మూడు సర్వే నంబర్లలో 600 ఎకరాల్లో ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న తమకు పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరుతూ రైతులు ధర్నా నిర్వహించారు.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని ఏడు గ్రామాలకు చెందిన 448 మంది గిరిజనులు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. సీలింగ్ భూములకు హద్దులు నిర్ణయించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా న్యాయం చేయాలని కలెక్టర్ అనుదీప్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.