తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగెంతో వినూత్నం... అన్నదాతలకు వీరెంతో ఆదర్శం - తెలంగాణ వ్యవసాయ వార్తలు

వీళ్లంతా సామాన్య రైతులే. ఒకప్పుడు సంప్రదాయ పంటలైన వరి, పత్తి, మిరప లాంటివి సాగుచేసి కష్టనష్టాలపాలైన వారే. ఒకే పంటవేసి దానిపై లాభం వస్తుందా? రాదా? అని దిక్కులు చూస్తూ కూర్చున్నవారే. అలాగని నిరాశలో కూరుకుపోలేదు. ఆ అనుభవాలు నేర్పిన పాఠాలు..గుణపాఠాలతో మేల్కొన్నారు.

వినూత్న ప్రయోగాలతో సాగులో వైవిధ్యం... లక్షలు ఆర్జిస్తూ అందరికీ ఆదర్శం
వినూత్న ప్రయోగాలతో సాగులో వైవిధ్యం... లక్షలు ఆర్జిస్తూ అందరికీ ఆదర్శం

By

Published : Feb 15, 2021, 10:23 AM IST

ఉన్నదే ఒకట్రెండు ఎకరాలు. అందులో సేద్యం చేసి బతికేదెలా? అందుకే పొలాన్ని కౌలుకిచ్చా. చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా. నగరాల్లో సెక్యూరిటీ గార్డులు, సేల్స్‌మెన్‌, వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ఉపాధి పొందుతున్న చాలామంది చెప్పే మాటలివి. కానీ ఉపాయం ఉంటే..కాస్త వినూత్నంగా ఆలోచిస్తే తక్కువ విస్తీర్ణంలోనూ సేద్యం చేసి రూ. లక్షలు ఆర్జించవచ్చంటున్నారు పలువురు ఔత్సాహికులు.

* కేవలం పదిసెంట్ల భూమిలో ఐదు అంచెల్లో పంటలు సాగుచేయవచ్చని మీకు తెలుసా. అందులోంచి రూ.50 వేల ఆదాయం వస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! ఎకరా విస్తీర్ణంలో ఆకుకూరల విత్తనాలు చల్లితే నెలన్నరకోసారి పంటతీస్తూ లక్ష సంపాదించవచ్చని, సేంద్రియ విధానంలో అరటిసాగుచేస్తే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కన్నా ఎక్కువే ఆర్జించవచ్చని, మల్బరీ సాగుతో ఏడాదంతా డబ్బులు పండించవచ్చని చెబితే నమ్ముతారా?! మమ్మల్ని చూశాక నమ్మాల్సిందే అంటున్నారు కొందరు అనితర‘సేద్యు’లు! తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎలాంటి సాగు విధానాలను అనుసరిస్తున్నారో తెలుసుకుందామా...

ఒకే మడిలో సాగైన రకరకాల పంటల మధ్య గంగులప్ప

ఐదంతస్తుల విధానం.. పది సెంట్లలో రూ.50 వేల ఆదాయం

ప్రకృతి వ్యవసాయ విధానంలో పదకొండేళ్లుగా కూరగాయలు, ఇతర పంటలు పండిస్తున్నా. చెరకులో అంతర పంటలుగా ఆకుకూరలు, కూరగాయలు సాగుచేశా. ప్రయోగాత్మకంగా పదిసెంట్ల భూమిలో ఐదు అంతస్తుల విధానాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నా. గత ఏప్రిల్‌లో భూమిని సిద్ధంచేశా. మొదటి అంతస్తులో భూమి లోపల వచ్చే పంటలైన గడ్డజాతికి చెందిన క్యారట్‌, అల్లం, పసుపు, బంగాళదుంప, ముల్లంగి నాటా.

రెండో అంతస్తుగా: అడుగు, అడుగున్నర ఎత్తు మాత్రమే పెరిగే ఆకుకూరల్ని పెంచా.

మూడోదిగా: రెండున్నర అడుగులపైన పెరిగే టమాట, మిరప, వంగ, బెండ, బీన్స్‌ వేశా.

నాలుగోదిగా: తీగజాతి రకాలైన బీర, కాకర, సొర తదితర విత్తనాలు చల్లా.

ఐదోదిగా: పొలం చుట్టూ అల్ల నేరేడు, పనస, మునగ పెంచుతున్నా.

పంటలు చేతికొచ్చేదిలా

ఆకు కూరలు నెల నుంచి నెలన్నరలో చేతికొస్తాయి. తర్వాత బెండ, బీన్స్‌, వంగ, మిరప, టమాట తదితర పంటలొస్తాయి. తర్వాత కొద్దిరోజులకే తీగజాతి కూరగాయల దిగుబడి తీసుకోవచ్చు. గడ్డజాతిలో అల్లం, పసుపు ఎనిమిది నెలల పంట కావడంతో ఆలస్యంగా వస్తుంది. ఆ లోపు అన్ని రకాల దిగుబడి పూర్తవుతుంది. మొత్తంగా రూ.50 వేల ఆదాయం లభించింది. ఈ విధానం బాగుంది. రైతులకు లాభదాయకంగా ఉంటుంది. ఈ దఫా ఆరు అంతస్తుల విధానం అనుసరిస్తా. - గంగులప్ప, చౌకిళ్లవారిపల్లె, నిమ్మనపల్లి మండలం, చిత్తూరు జిల్లా

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి సేంద్రియ సాగు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మందలపల్లికి చెందిన దేవరపల్లి హరికృష్ణ గతంలో హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంచేస్తూ, వారాంతపు సెలవుల్లో సేంద్రియ సాగులో ఎన్నో ప్రయోగాలు చేసి అవార్డులు దక్కించుకున్నారు. ఏడాది క్రితం ఉద్యోగాన్ని పూర్తిగావదిలి సేద్యంపైనే దృష్టిపెట్టారు. సేంద్రియ విధానం, మల్చింగ్‌ పద్ధతిలో ఎనిమిది ఎకరాల్లో అరటి సాగుచేశారు. అంతరపంటగా పసుపువేశారు. హైదరాబాద్‌లో సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ ఉండటంతో అరటికాయలను అట్టపెట్టెల్లో భద్రపరిచి అక్కడికి తరలిస్తున్నారు. ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో సేవలను వినియోగించుకుంటున్నారు. వీటితోపాటు సంప్రదాయ విధానంలో పండించిన ధాన్యాన్ని మర ఆడించి ఔత్సాహికులను అమ్ముతున్నారు. కేవలం అరటి ద్వారానే ఎకరాకు రూ.5-6 లక్షల ఆదాయం ఆర్జించినట్టు హరికృష్ణ తెలిపారు. గతేడాది రైతునేస్తం పురస్కారాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా అందుకున్నారు. ‘సేంద్రియ సాగుతో ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. చీడ,పీడల బెడద చాలా తక్కువ. ఇలాంటి పద్ధతులను రైతులు అసుసరించాలి’ అని ఆయన సూచించారు.

తన తోటలోని అరటి గెలతో దేవరపల్లి హరికృష్ణ

‘పట్టు’పట్టి లాభపడ్డా...

నల్గొండ జిల్లా కనెగల్‌ మండలం నర్సింహాపురం గ్రామంలో ఐదెకరాల భూమిలో మల్బరీ సాగుచేశా. రాయితీతో బిందుసేద్యం పరికరాలు కొన్నా. పట్టుపురుగుల పెంపకానికి షెడ్డు రూ.5 లక్షలతో నిర్మించా. అందులో కేంద్ర ప్రభుత్వ రాయితీ రూ.2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ రాయితీ రూ.లక్ష లభించింది. కిలో పట్టుగూళ్లు పండించడానికి రూ.230 నుంచి 250దాకా ఖర్చయింది. కిలో పట్టుగూళ్లకు రూ.400 నుంచి రూ.477 వరకు ధర ఉంది. రాష్ట్ర ఉద్యానశాఖ కిలోకు మరో రూ.75 ప్రోత్సాహకం ఇస్తోంది. ఒక పంటకు 160-170 కిలోల పట్టుగూళ్ల దిగుబడి వస్తుంది. కిలోకు రూ.200 కనీస లాభం వచ్చిందనుకున్నా రూ.32 వేలు మిగులుతుంది. ఏడాదికి నాలుగు సార్లు పట్టుగూళ్లు వస్తాయి. తక్కువలో తక్కువగా ఎకరానికి ఏడాదికి రూ.లక్ష లాభం వస్తోంది. ఈ సాగుతో ఐదెకరాలపై గత ఏడాది కాలంలో రూ.6 లక్షలు ఆర్జించా. ఈ సాగుకు తెలంగాణ భూములు, వాతావరణం చాలా అనుకూలం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఈ పంటపై శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి కూడా. - జెల్లా పుండరీకం, పట్టు, మల్బరీ రైతు, నర్సింహాపురం, నల్గొండ జిల్లా.

జెల్లా పుండరీకం, పట్టు, మల్బరీ రైతు

ఒక్క ఇంచు నీళ్లు.. రెండెకరాల్లో సాగు

తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలు సాగుచేస్తున్నారు యువ రైతు బోల్ల ఆంజనేయులు. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం చెన్నాపూర్‌ గ్రామానికి చెందిన ఆయన డిగ్రీ పూర్తిచేసి సేద్యంపైనే ఆధారపడ్డారు. తనకున్న రెండెకరాల భూమిలో ఒక్క ఇంచు(అంగుళం) మేర నీరువచ్చే బోరు మాత్రమే ఉండటంతో బిందుసేద్యాన్ని అనుసరించారు. రకరకాల కూరగాయలు సాగుచేస్తున్నారు. క్యాబేజీ, కాలీఫ్లవర్‌, టమాట, మొక్కజొన్న, స్వీట్‌కార్న్‌, సొర, ఇతర కూరగాయలు సాగుచేసి లాభాలు ఆర్జిస్తున్నారు. 6,500 కోళ్లతో కోళ్లఫారం నిర్వహిస్తూ దానికీ ఆ నీటినే అందిస్తున్నారు. ఆరుతడి పంటలతో మంచి దిగుబడులు వస్తున్నాయని ఆంజనేయులు తెలిపారు.

ఏడాదికి తొమ్మిది పంటలు తీస్తాం

పదిహేనేళ్లుగా ఆకుకూరలే పండిస్తున్నా. గోంగూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, మెంతికూర తదితరాలు వేస్తున్నా. ఆకు కూరలు ఏడాదికి ఎనిమిది నుంచి తొమ్మిదిసార్లు కోయవచ్చు. ఒక పంట దెబ్బతిన్నా, ధర దక్కకపోయినా తర్వాత పంటలో ఆదాయం వస్తుందనే నమ్మకం ఉంటుంది. పెట్టుబడి తక్కువగా ఉంటుంది. విత్తనాలకు రూ.2 వేల వరకు ఖర్చవుతుంది. మార్కెట్లో 100 కట్టలను రూ.120 చొప్పున అమ్ముతాం. మొత్తంగా ఎకరాకు ఏడాదికి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది. - తోట నాగరాజు, కుంచనపల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా.

వీళ్లంతా సామాన్య రైతులే. ఒకప్పుడు సంప్రదాయ పంటలైన వరి, పత్తి, మిరప లాంటివి సాగుచేసి కష్టనష్టాలపాలైన వారే. ఒకే పంటవేసి దానిపై లాభం వస్తుందా? రాదా? అని దిక్కులు చూస్తూ కూర్చున్నవారే. అలాగని నిరాశలో కూరుకుపోలేదు. ఆ అనుభవాలు నేర్పిన పాఠాలు..గుణపాఠాలతో మేల్కొన్నారు. ఒక మడిలో అంతర పంటలతో పాటు తక్కువ సమయంలో చేతికొచ్చే కూరగాయలు, ఆకుకూరలు, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో గిరాకీ ఉండే పట్టు, అరటి తదితరాల సాగువైపు దృష్టిసారించారు. పంట పొలాన్నే ప్రయోగశాలగా మార్చి లాభాలు ఆర్జిస్తున్నారు.

ఇదీ చూడండి:మేడారం చిన జాతరకు ముందే తరలివస్తున్న భక్తులు

ABOUT THE AUTHOR

...view details