Crop Damage due to Untimely Rains in Telangana: అకాలవర్షాలు అన్నదాతకు తీరని నష్టాలను మిగిల్చాయి. ఏ జిల్లాలో చూసినా చేతికొచ్చిన పంట నీటిపాలై రైతన్న కుదేలయ్యాడు. జోగులాంబ గద్వాల జిల్లాలో అకాల వర్షాలకు 4,095 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. కేటి దొడ్డి, ధరూరు, గద్వాల మండలాలలో ఎక్కువగా నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. చేతికందిన పంట నీటిపాలవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కర్షకులు అలమటిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం కూడా తడుస్తుండటంతో ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్నారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట సహా రాయపర్తి, పర్వతగిరి సంగెం మండలాల్లో.. కోతకు వచ్చిన వరి, మొక్కజొన్న పంటలు అకాల వర్షానికి నేలవాలాయి. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యపురాశులు వరదనీటిలో మునిగిపోగా వాటిని ఆరబెట్టేందుకు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోనూ ధాన్యం కొనుగోళ్ల కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. దంతాలపల్లి, కురవి, మరిపెడ, చిన్నగూడూర్, నరసింహులపేట, డోర్నకల్ మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు.
ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా బొమ్మకల్, దుర్శేడ్ గ్రామాల్లో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను, గోపాలపూర్లో నష్టపోయిన ఉద్యాన పంటలను మంత్రి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు.నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ముదక్ పల్లిలో వడగండ్ల వానకు దాదాపు 200 ఎకరాల వరి పంట పూర్తిగా నేల రాలిపోయింది. గత 12 రోజులుగా వరికోత యంత్రాలు దొరకక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.