తెలంగాణ

telangana

ETV Bharat / state

Farmers Problems in Telangana : రైతన్న ఆగమాగం.. ధాన్యం కొనుగోలు చేసేది ఎప్పుడు..? - కామారెడ్డి రైతుల కష్టాలు

Crop Damage in Nizamabad : అకాల వర్షం అన్నదాతను ఆగం చేసింది. సాధారణంగా ఒకటి రెండు రోజులు మాత్రమే ఉండే చెడగొట్టు వాన ఇప్పుడు మాత్రం ఏకంగా రోజుల తరబడి కురుస్తునే ఉంది. చేతికొచ్చిన పంట అమ్మితే డబ్బులు వస్తాయని భావిస్తే.. అనుకోని వానలతో రైతుల కళ్లల్లో కన్నీళ్లే మిగిలాయి. కనీసం పెట్టుబడి డబ్బులైనా మిగిలే పరిస్థితి కనిపించలేదని రైతులు బాధపడుతున్నారు.

Crop Damage in Kamareddy
Crop Damage in Kamareddy

By

Published : May 10, 2023, 7:23 PM IST

Crop Damage in Nizamabad : నిజామాబాద్ జిల్లాలో యాసంగిలో సుమారు 30వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి 20వేల ఎకరాలు, నువ్వులు 4500 ఎకరాలు, సజ్జ 800 ఎకరాలతో పాటు మామడి, కూరగాయలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ గ్రామీణం, మోపాల్, డిచిపల్లి, ఇందల్వాయి, సిరికొండ, ధర్పల్లి, భీంగల్, కమ్మర్ పల్లి, జక్రాన్ పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల, ముప్కాల్, మెండోరా, బాల్కొండ, ఆర్మూర్, మాక్లూర్, నందిపేట, నవీపేట, బోధన్, సాలూర, రెంజల్ మండలాల్లో అకాల వర్షం తీవ్రంగా నష్టం కలిగించింది.

కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి : కాటా వేస్తున్నా ప్రభుత్వ జాప్యం కారణంగా రైతులు ఎక్కువ రోజులు ఎదురు చూడాల్సి వస్తోంది. కొన్ని కేంద్రాల్లో లారీలు సమయానికి రాక రైతులు వర్షం వస్తుందేమోనని భయపడుతున్నారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కడ్తా లేకుండా ప్రభుత్వం తడిసిన ధాన్యం కొంటామని చెప్పినా.. క్షేత్రస్థాయిలో ఆ నిబంధన అమలు అవ్వట్లేదని ఆవేదన చెందుతున్నారు.

కామారెడ్డి జిల్లాలో ఏ ఏ ఊర్లో ధాన్యం తడిసిపోయింది : కామారెడ్డి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వానలతో కర్షకుల ఆరుగాలం కష్టం కనుమరుగవుతోంది. కోతకు వచ్చిన వరి కంకుల గింజలు నేలరాలిపోతున్నాయి. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని బాన్సువాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాలతో పాటు జుక్కల్ నియోజ కవర్గంలోని బిచ్కుంద, నిజాంసాగర్, పిట్లం.. కామారెడ్డి నియోజకవర్గం పరిధిలోని మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయింది.

వర్షాలు కారణంగా కొనుగోలు ఆలస్యం :ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి, నాగిరెట్టిపేట్, లింగంపేట్, రాజంపేట, రామారెడ్డి మండలాల్లో అకాల వర్షాలకు తీవ్ర నష్టం కలిగించింది. జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో జిల్లా వ్యాప్తంగా 63వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయశాఖ అంచనా వేసింది. జిల్లాలో ఇప్పటికీ పలు చోట్ల రాత్రి పూట వర్షాలు కురుస్తూనే ఉండటంతో రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. ఉదయం ఆరబెట్టడం.. రాత్రి వర్షానికి తడవటం ఇదే తంతుగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాల కారణంగా ధాన్యం సేకరణలో జాప్యం జరుగుతోందని వాపోయారు. ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

"వర్షాలకు ధాన్యం అంతా తడిసిపోయింది. ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. రైస్‌ మిల్లు దగ్గరికి లారీలు రావట్లేదు. అప్పుడే ఎండ కాస్తుంది. వెంటనే వాన పడుతుంది. దీంతో మరింత ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికి నా రెండు ఎకరాలు నీటిలోనే మునిగి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తొందరగా కొనాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను." - స్థానిక రైతు

నిజామాబాద్‌ జిల్లాలో రైతుల కష్టాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details