Crop Loss Due To Untimely Rains: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత నెలలో అకాల వర్షాలు కురవగా.. పంటలు దెబ్బతినడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పరిశీలించడమే కాకుండా ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. అయితే వరుసగా మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా మళ్లీ పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా ప్రకారం.. అన్ని పంటలు కలిపి 66 వేల 987 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. కరీంనగర్, రామడుగు, సైదాపూర్, చొప్పదండి తదితర మండలాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
అకాల వర్షం.. నేలరాలిన మామిడి: ప్రభుత్వానికి త్వరితగతిన నివేదిక ఇస్తామని రైతన్నలకు భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టుకోవడానికే సమయం సరిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలుల కారణంగా జగిత్యాల జిల్లాలో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన మామిడి నేలరాలింది. పెద్దపల్లి జిల్లాలో 14 వేల 620 ఎకరాల్లో పంట నీటి పాలైంది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల వద్ద సరైన టార్పాలిన్లు లేకపోవడంతో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది.
రైతు తన పంట చేతికందే సమయంలో అకాల వర్షాలతో పంట మొత్తం నష్టపోవడం చాలా బాధకరం. మొత్తం నీటి పాలైంది. ఎకరానికి క్వింటాల్ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం మొత్తాన్ని మేమే కొనుగోలు చేస్తాం. తడిసిన ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. - గంగుల కమలాకర్, మంత్రి