Crops Damaged in Telangana: అకాల వర్షాలు, వడగళ్ల వానలు రాష్ట్రంలో రైతులను కంటిమీద కునకు లేకుండా చేస్తున్నాయి. కంటికి రెప్పలా కాపాడుకున్న ఏపుగా పెరిగిన వరి.. ఈదురుగాలులు, రాళ్ల వానలతో.. గింజన్నదే లేకుండా పోయింది. చేలో ఉన్న కాసింత ధాన్యాన్ని అమ్ముకుందామంటే వీడని వరుణుడు పదే పదే సాగుదారుడిని దెబ్బ తీస్తున్నాడు. ఆరుగాలం శ్రమించిన అన్నదాత ప్రకృతి ప్రకోపం చూసి దిగాలు చెందుతున్నాడు.
కొనుగొలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతన్న: ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దవుతోంది. ధాన్యం కాటాలు వేసి కొనుగొలు చేసే వారు కరవయ్యారని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా వరి ధాన్యం ఉంచినందున తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఐకేపీ కేంద్రం నిర్వాహకులు, మిల్లర్ల మధ్య సమస్వయ లోపం వల్ల నష్టపోతున్నామని విమర్శించారు. గన్నీ సంచులు, లారీల కొరత వల్ల కొనుగొలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నామని నిరసన తెలిపారు.
తేమ శాతంలో సంబంధం లేకుండా కొనుగోలు చెయ్యాలి:మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం, గూడూరు ఏజెన్సీ ప్రాంతాల్లో నడి వేసవిలో వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి. వట్టి వాగు పొంగడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బయ్యారం, కేసముద్రం, నెల్లికుదురు, మహబూబాబాద్ మండలాల్లో వరి, మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.