Farmers Handcuffs Incident in Telangana :రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చాలంటూ గత నెల 30న యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న పలువురు రైతులు, రాజకీయ పార్టీల నేతలను అదే రోజు రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన, మంత్రి కాన్వాయ్‌కు అడ్డుపడిన వ్యవహారంలో.. పల్లెర్ల యాదగిరి, గడ్డమీది మల్లేశం, మల్లబోయిన బాలనర్సింహ, అభిశెట్టి నిఖిల్, కాంగ్రెస్ నేత రవికుమార్, బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నలుగురు రైతులను రిమాండ్‌కు తరలించారు.
Handcuffs To Farmers in Yadadri : 14రోజుల పాటు నల్గొండ జైల్లో ఉన్న ఈ నలుగురి రిమాండ్ గడువు పొడిగించాలంటూ ఈనెల 13వ తేదీన.. పోలీసులు వారిని భువనగిరి కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. నలుగురిని న్యాయస్థానంలో హాజరుపర్చిన అనంతరం, తిరిగి జైలుకు తరలించే క్రమంలో వారికి సంకెళ్లు వేసి, వాహనంలోకి ఎక్కించారు. రైతులకు బేడీలు వేసి తీసుకువెళ్లటంపై అక్కడే ఉన్న బాధిత కుటుంబ సభ్యులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Opposition Leaders Respond on Farmers Handcuff issue : రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఖండించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి మాత్రమే బేడీలు వేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా.. మామూలు రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు శోఛనీయమన్నారు. బేడీలు వేసిన పోలీసులపై చర్యలు తీసుకుని, రైతులకు న్యాయం చేయాలన్నారు. భూసేకరణను వ్యతిరేకించిన రైతులకు.. పోలీసులు బేడీలు వేయడంపై కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేసిన అన్నదాతల్ని కోర్టుకు తీసుకు వస్తున్నప్పుడు సంకెళ్లు వేయడం దారుణమని.. బేడీలు వేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.