రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పంటల సాగు కొనసాగుతోంది. ఈ ఏడాది వానాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 34 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు పూర్తైంది. ప్రధాన వాణిజ్య పంట పత్తి 26.05 లక్షల ఎకరాలు, కంది 3.18 లక్షల ఎకరాల్లో రైతులు గింజలు విత్తుకున్నారు. మరో 96 వేల ఎకరాల్లో వరి నాట్లు వేయడం పూర్తైంది. జూన్ మాసాంతానికి సాధారణ వర్షపాతం 130 మిల్లీమీటర్లు నమోదు అవ్వాల్సి ఉండగా... 50 శాతం అదనంగా 194.55 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.
రాష్ట్రంలో వానాకాలం సీజన్ పనుల్లో రైతన్నలు నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 140.12 లక్షల ఎకరాల్లో సాగు ప్రణాళిక అంచనా వేయగా... ఇప్పటి వరకు 34.35 లక్షల ఎకరాల విస్తీర్ణంలో విత్తు పూర్తయింది. అంటే దాదాపు 25 శాతం పూర్తయినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రధాన వాణిజ్య పంట పత్తి 26.05 లక్షల ఎకరాల్లో అన్నదాతలు విత్తుకున్నారు. కంది 3.18 లక్షల ఎకరాల్లో వేయగా.. 96 వేల ఎకరాల్లో వరి నాట్లు వేయడం పూర్తైందని వ్యవసాయ శాఖ నివేదికలో వెల్లడించింది. దాదాపు 50 వేల ఎకరాల్లో పెసర, లక్ష ఎకరాల్లో మొక్కజొన్న సాగు నమోదైంది. ఇవి కాకుండా 87 వేల ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల సాగు నమోదైంది.
ప్రభుత్వ సూచనలో పత్తి, కంది వైపే మొగ్గు
ఈ సీజన్లో 5.7 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, బహుళ వార్షిక ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పత్తి, కంది సాగు క్షేత్రస్థాయిలో ఎక్కువగా నమోదవుతోంది. రైతు సోదరులు దీనిని కొనసాగిస్తూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి, పప్పు దినుసులు, నూనె గింజల పంటలనే ఎక్కువగా సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. రైతుల సౌకర్యార్థం ఇప్పటి వరకు రైతుబంధు కింద 7360.41 కోట్ల రూపాయలు 60.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఈ ఖరీఫ్ సీజన్లో వరి సాగు తగ్గించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ ఏడాది ఆశాజనకంగా వర్షపాతం