తెలంగాణ

telangana

ETV Bharat / state

Armoor Seeds: ఆర్మూర్‌ 'విత్తనం'... జగద్విఖ్యాతం.. - ARMOOR FARMERS SPECIALITY

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంత రైతులు జొన్న(SORGHUM SEEDS), సజ్జ(SAJJA SEEDS) విత్తుల పంటలతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు తయారు చేయడంతో సంస్థలు, వ్యాపారులు మంచి ధర ఇచ్చి కొనుక్కుంటున్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు, దేశాలకూ పెద్దఎత్తున ఎగుమతి(SEEDS EXPORT) చేస్తున్నారు. ఏటా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు.

farmers-creating-miracles-with-sorghum-and-sajja-seed-crops
ఆర్మూర్‌ ‘విత్తనం’.. జగద్విఖ్యాతం

By

Published : Jul 9, 2021, 6:59 AM IST

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ప్రాంత రైతులు విత్తనోత్పత్తి(seeds production)లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తూ మంచి లాభాలను కళ్లజూస్తున్నారు. ఆదర్శ వ్యవసాయ విధానాలు పాటిస్తూ.. భూసారాన్ని కాపాడుకుంటూ మేలు రకం విత్తనాలు పండిస్తుండటంతో అవి ఇతర రాష్ట్రాలకే కాక విదేశాలకూ ఎగుమతవుతున్నాయి. విత్తన పంటలతో ఆదాయానికి ఢోకా లేకపోవడంతో ఈ ప్రాంతంలోని పలువురు రైతులు వాటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే అన్నదాతలు మరింత ప్రయోజనం పొందుతారు. వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో(Agricultural research centers) శాస్త్రవేత్తలు వాతావరణ పరిస్థితులు, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో డిమాండుకు అనుగుణమైన నూతన వంగడాలను తయారు చేసి అందిస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందని వారు పేర్కొంటున్నారు.

40 ఏళ్ల క్రితం బీజం పడింది...

నాలుగు దశాబ్దాల కిందట 1980లో ఒక ప్రముఖ విత్తన కంపెనీ రైతులకు పశుగ్రాస జొన్న విత్తనాన్ని పరిచయం చేసింది. తిరిగి తామే కొనుగోలు చేసే(బైబ్యాక్‌) ఒప్పందం చేసుకొని మూల విత్తనాలిచ్చి, పండించిన పంటను కంపెనీయే కొనుగోలు చేసింది. వాటిని శుద్ధి చేసి ఇతర రాష్ట్రాల్లో విక్రయించేది. ప్రస్తుతం వివిధ కంపెనీలతోపాటు కొందరు రైతులూ ఈ వ్యాపారం చేస్తున్నారు. ఇది లాభసాటిగా ఉండటంతో జిల్లావ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో విత్తన జొన్న(SORGHUM SEEDS) సాగవుతోంది. సజ్జ విత్తనోత్పత్తి(SAJJA SEEDS) కూడా 40 ఏళ్ల కిందటే ప్రారంభమైంది. మొదట్లో నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌ ద్వారా మూల విత్తనాలిచ్చేవారు. రైతులు పండించినవి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ప్రముఖ కంపెనీలతో పాటు స్థానిక కంపెనీలూ విత్తనోత్పత్తి చేయిస్తున్నాయి. జిల్లాలో 35 వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది.

నేల స్వభావం.. రైతన్న కృషి ఫలితం

ఇక్కడ ఎర్రచల్క, నల్లరేగడి భూములున్నాయి. తమ పొలాల్లో చెరువు మట్టి, సేంద్రియ ఎరువులు వేస్తూ సారవంతం చేసుకుంటారు. నీటి వసతి కల్పించుకొని మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తారు. పంటలకు చీడపీడలు ఆశించకుండా చూసుకుంటారు. వారి కష్టానికి అనువైన నేలలు, అనుకూలమైన వాతావరణం ఉండడంతో పంటలు బాగా పండుతాయి. విత్తనాలు మంచి పరిమాణంలో వస్తాయి. మేలురకం గింజలు కావడంతో వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో డిమాండు ఉంటోంది. నిజామాబాద్‌ జిల్లాలో 13 మండలాలు, నిర్మల్‌ జిల్లాలో కొంత, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రాంతంలో ఈ పంటలు సాగవుతున్నాయి. దాదాపు 70 వేల ఎకరాల్లో ఎర్ర, తెల్ల, ముళ్ల జొన్న, 50 వేల ఎకరాల్లో సజ్జ, పదివేల ఎకరాల్లో విత్తన వరి, మొక్కజొన్న సాగుచేస్తున్నారు. ఏటా దాదాపు రూ.200 కోట్ల వ్యాపారం జరుగుతోంది.

వివిధ దేశాలకు ఎగుమతి

  • దిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారులు, కొన్ని బహుళజాతి కంపెనీలు ఈ ప్రాంత విత్తనాలను పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, వియత్నాం, అఫ్ఘనిస్థాన్‌, నేపాల్‌ తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
  • పశుగ్రాస జొన్నలను పాకిస్థాన్‌కు 15 వేల టన్నులు, బంగ్లాదేశ్‌కు 10 వేల టన్నులు, శ్రీలంక, వియత్నాం, అఫ్ఘనిస్థాన్‌లకు 5 వేల టన్నులు ఎగుమతి చేస్తున్నారు.
  • సజ్జలు పాకిస్థాన్‌కు 20 వేల టన్నులు, బంగ్లాదేశ్‌కు 10 వేల టన్నులు, వియత్నాంకు 2 వేల టన్నులు ఎగుమతి అవుతున్నాయి.
  • కొన్ని ప్రముఖ కంపెనీలు ఇక్కడ పండించిన వరి విత్తనాలను హైదరాబాద్‌లో ప్రాసెసింగ్‌ చేయించి వియత్నాం, శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్నాయి. వరి 2 వేల టన్నులు, మొక్కజొన్న వెయ్యి టన్నులు పంపుతారు.

కూరగాయల విత్తనోత్పత్తిపై దృష్టి పెట్టాలి...

కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో సాగుచేసే కూరగాయల విత్తనోత్పత్తిపై ఆర్మూర్‌ ప్రాంత రైతులు దృష్టి సారించాలి. ఇక్కడి నేలలు అనుకూలమని ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్పారు. రైతులు ప్రయోగాత్మకంగా సాగు చేయాలి.

విత్తన ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి..

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, సీడ్‌ సర్టిఫికేషన్‌ సంస్థకు పూర్తిస్థాయి ఐఏఎస్‌ అధికారులు ఉండాలి. విత్తనోత్పత్తి రీసెర్చ్‌ మొదలుకొని ఎగుమతి వరకు పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఐఏఎస్‌ను నియమించాలి. ఆర్మూర్‌ ప్రాంతంలో విత్తన ఎగుమతి కేంద్రం ఏర్పాటు చేయాలి.

ఇదీ చూడండి:Cheddi Gang CCTV footage: అర్ధరాత్రి వేళ చేతిలో రాడ్లు, ఒంటిపై నిక్కర్లతో చెడ్డిగ్యాంగ్ హల్​చల్​

ABOUT THE AUTHOR

...view details