తీవ్రమైన ఎండల తాకిడికి భూమి తల్లి నెర్రెలు వారుతోంది. గత వానాకాలంలో పుష్కలంగా వర్షాలు కురిశాయి.. బోర్లలో నీరుందని కోటి ఆశలతో పెద్ద ఎత్తున వరి నాట్లు వేసిన రైతులకు ఇప్పుడు నిరాశే మిగులుతోంది. పలుచోట్ల బోర్లు అడుగంటుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 25.10 లక్షల వ్యవసాయ బోర్లకు కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. వాటికి విద్యుత్ వినియోగం రోజుకు 5 వేల మెగావాట్లను దాటిందనేది విద్యుత్ సంస్థల తాజా అంచనా. గతంలో 4 వేల మెగావాట్లుండేది. ప్రస్తుత యాసంగి సీజన్‌లో వరి సాధారణ విస్తీర్ణం 22.19 లక్షల ఎకరాలైతే రైతులు ఏకంగా 52.80 లక్షల ఎకరాల్లో వేశారు.
- బోర్లపై పంటల సాగు రాష్ట్రంలోకెల్లా మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువ. మెదక్ జిల్లాలో యాసంగిలో వరి సాధారణ విస్తీర్ణం 64,175 ఎకరాలైతే ఏకంగా 2.12 లక్షల ఎకరాల్లో వేశారు. సిద్దిపేటలో లక్ష ఎకరాల సాధారణ విస్తీర్ణానికి 2.83 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి.
కొంత పంటనయినా దక్కించుకుందామని..
'నాకు 3 ఎకరాల భూమి ఉంటే మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. సొంత భూమిలో బోరు ఉంది. దాని నుంచి నీరు పెట్టి కౌలుకు తీసుకున్న భూమిలో వరి నాట్లు వేశా. ఎకరాకు రూ.10 వేలు కౌలు చెల్లించా. కౌలుతో సహా 2 ఎకరాలకు కలిపి రూ.50 వేలు ఖర్చుపెడితే బోరు ఎండిపోయింది. రెండు రోజులకు కొంచెం నీరు వస్తుంటే 3 ఎకరాల్లో కొంత పంటనయినా దక్కించుకుందామని రోజు మార్చి ఒక్కో మడికి కొంచెం కొంచెం నీరు పెడుతున్నా.'
- వస్తాదుల బాబూరావు, సిద్దన్నపేట, నంగునూరు మండలం, సిద్దిపేట జిల్లా