onion prices fall in Telangana: మార్కెట్‌లో రోజురోజుకు ఉల్లి ధరలు పతనం అవుతుండటంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో భారీగా ఉత్పత్తి పెరగడం సహా ఒకేసారి పంట మార్కెట్‌లోకి రావడంతో ధరలు సగానికి పైగా పడిపోయాయి. లాసర్‌గాం, బెంగళూరు, షోలాపూర్ వంటి ప్రధాన మండీల్లో కిలో ధర 1 రూపాయి మాత్రమే పలకడంతో తెలుగు రాష్ట్రాలపై తీవ్రప్రభావం చూపుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి హైదరాబాద్ మలక్‌పేట మార్కెట్‌కు ఉల్లి సరకు పోటెత్తుతోంది. రైతులు అంతదూరం నుంచి మార్కెట్‌కు పంట తీసుకొస్తే.. ఇక్కడ క్వింటాల్ ధర 400 నుంచి 1200 రూపాయలకు మించి రావడంలేదు. ఆ రేట్లు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదంటూ ఉల్లి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉల్లిధరపై కేంద్రం తీసుకుంటున్న చర్యలు: దేశంలో ఉల్లిధరల పతనంపై కేంద్రం అప్రమత్తమైంది. వెంటనే కర్షకుల నుంచి సరుకు కొనుగోలు చేయాలంటూ నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్‌లను కేంద్రం ఆదేశించింది. ప్రతికూల పరిస్థితి ఉత్పన్నమై మార్కెట్‌లో ధరలు పడిపోయినప్పుడు సమతుల్యం చేయడానికి ధరల సమతుల్య నిధిని ఏర్పాటు చేసింది. ఆ నిధి కింద సేకరించిన ఉల్లిని బఫర్ నిల్వలుగా పెట్టాలని, కొరత ఏర్పడినప్పుడు వాటిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు క్వింటాల్‌కు 900 రూపాయల ధర చొప్పున గత 11 రోజుల్లో నాఫెడ్ 4500 క్వింటాళ్లు సేకరించింది. ఐతే రాష్ట్రంలో నాఫెడ్ రంగంలోకి దిగలేదు. ఎకరానికి లక్ష పెట్టుబడి పెడితే కనీసం 30 వేలు మించి రావట్లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉల్లిసాగు చేయడం సాధ్యంకాదని కంట తడిపెడుతున్నారు.