Untimely Rains in Telangana : రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అకాల వర్షాలకు ఈదురుగాలులు, పిడుగులు తోడవడంతో ప్రజలు వణికిపోయారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్, రాయికల్ మండలాల్లో రైతుల కళ్ల ముందే కల్లాల్లో ఆరబోసిన ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. సారంగాపూర్ మండలం పెంబట్లలో వరికోత మిషన్‌తో వరి కోస్తుండగా వర్షం రావడంతో చెట్టుకింద నిలబడ్డ రైతు దంపతులపై.. పిడుగుపడి జోగిని పద్మ అనే మహిళా మృతి చెందగా, ఆమె భర్త గంగమల్లు తీవ్రంగా గాయపడ్డాడు. జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
గత 15 రోజులుగా జిల్లాలో వరుణుడు ప్రతాపం చూపుతుండగా.. ఐదు రోజులుగా ఎండలు కాస్తూ ఉండటంతో ధాన్యం ఎండబెడుతున్న తరుణంలో మళ్లీ కురిసిన వర్షం.. అన్నదాతలను మరింత కుంగదీసినట్లయింది. ఐకేపీ కేంద్రాలు, మార్కెట్‌యార్డుల వద్ద రైతన్నలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి, ధర్పల్లి, భీంగల్ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం హడలెత్తించింది. భీంగల్ మండలం పల్లికొండ శివారులో పిడుగుపాటుకు సుమారు 48 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కాపరి అనిల్‌కు గాయాలయ్యాయి. ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి.. సరఫరా నిలిచిపోయింది.