తెలంగాణ

telangana

ETV Bharat / state

'బడ్జెట్​లో వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించాలి' - telangana varthalu

బడ్జెట్​లో వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు సంఘం కోరింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డికి ఆ సంఘం సభ్యులు లేఖ రాశారు. వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

'బడ్జెట్​లో వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించాలి'
'బడ్జెట్​లో వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించాలి'

By

Published : Mar 12, 2021, 3:53 AM IST

ఈ నెల 15 నుంచి జరగనున్న శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న దృష్ట్యా వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించాలని తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. పంట రుణాలు, రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయ ప్రణాళిక, రాయితీలు, మార్కెట్‌ జోక్యం, ధరల నిర్ణాయక సంఘం ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు ఆ సంఘం నేతలు సారంపల్లి మల్లారెడ్డి, తీగల సాగర్‌ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి లేఖ రాశారు. 2020-21లో వ్యవసాయశాఖ బడ్జెట్‌ కింద ప్రగతి పద్దు కింద రూ.17వేల 278 కోట్ల రూపాయలు, నిర్వహణ పద్దు కింద 900.40 కోట్ల రూపాయలు కేటాయించగా... ఇందులో ప్రధానంగా రైతుబంధు, రుణమాఫీకి కలిపి 15,263 కోట్ల రూపాయలు, రైతు బీమాకు 861.44 కోట్ల రూపాయలు చూపారని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ మూడు పద్దులు పోగా వ్యవసాయాభివృద్ధికి కేటాయింపులు పెద్దగా ఏమీ లేవని... మార్కెట్‌ జోక్యం పథకం, విత్తన, రసాయన ఎరువుల రాయితీ, యంత్రాల రాయితీ, ప్రకృతి వైపరీత్యాల పరిహారం, భూసార పరీక్షలు, పంటల సంరక్షణకు నిధులు కేటాయింపులు నామమాత్రంగానే ఉన్నందున ఈసారైనా భారీగా పెంచాలని మంత్రిని కోరారు. వ్యవసాయ రుణాలకు సంబంధించి 51,082 కోట్ల రూపాయలు, దీర్ఘకాలిక రుణాలు 12,306 కోట్ల రూపాయలు మొత్తం రూ.63,382 కోట్లు రూపాయలు చూపినా... నిధుల కేటాయింపుల్లో 50 శాతం కూడా పంట రుణాలు ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆదేశాల ప్రకారం బ్యాంకుల వ్యాపార ధనంలో విధిగా 18 శాతం వ్యవసాయ పంట రుణాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. రుణమాఫీ సకాలంలో బ్యాంకులకు చేరకపోవడం వల్ల బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడానికి నిరాకరించిన దృష్ట్యా వ్యవసాయ రుణ ప్రణాళిక ఏప్రిల్‌ 15 లోపు ప్రకటించడంతోపాటు కేటాయించిన నిధులు అప్పులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యవసాయ రుణ ప్రణాళికల సమీక్షలు మంత్రివర్గ స్థాయిలో ప్రతి మూడు మాసాలకు ఒకసారి జరపాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వైఎస్ షర్మిల పార్టీ.. మండల స్థాయి కమిటీల నియామకం!

ABOUT THE AUTHOR

...view details