మిర్చిలో నల్లతామరకు సోలార్ లైట్‌తో చెక్.. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి Chilli Crop Through Solar Lights: దేశంలో మిర్చి ఎక్కువగా సాగు చేసే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గుంటూరు జిల్లా అగ్రస్థానంలో ఉంటుంది. నల్లతామర పురుగు కారణంగా గతేడాది మిర్చి పంట 50 శాతం మేర దెబ్బతింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటల భీమాలో మిర్చి లేకపోవటంతో రైతులకు కనీసం పరిహారం కూడా రాని దుస్థితి. ఎకరాకు రూ.1.5 లక్షల పెట్టుబడి పెట్టిన రైతులు కనీసం ఆమేర కూడా ఆదాయం తీసుకోలేకపోయారు.
కౌలు రైతులైతే మరింతగా దెబ్బతిన్నారు. నల్లతామర నుంచి పంటను కాపాడేందుకు ఎన్నిరకాల మందులు కొట్టినా ఫలితం అంతంత మాత్రమే. ఈ తరుణంలో వట్టిచెరుకూరు మండలం చమళ్లమూడి గ్రామానికి చెందిన నాగ మల్లేశ్వరరావు అనే రైతు సోలార్ లైట్లను ఉచ్చుగా వాడి నల్లతామరతో పాటు ఇతర పురుగుల్ని, దోమల్ని నియంత్రిస్తున్నారు. ప్లాస్టిక్ తొట్టిని ఆధారంగా చేసుకుని లైటు నిలువుగా ఉంటుంది.
దాని పైన చిన్నపాటి సౌరఫలకం ఉంటుంది. పగటి సమయంలో సోలార్ ఫలకాల ద్వారా ఛార్జింగ్ అవుతుంది. రాత్రి 6 గంటలు కాగానే లైట్లు వాటంతట అవే వెలుగుతాయి. లైటు కింది భాగంలో చిన్నపాటి తొట్టె ఉంటుంది. కాంతిని ఆకర్షించే పురుగులు లైటు వద్దకు వచ్చి ఆ వేడికి తొట్టెలో పడిపోతాయి. తొట్టెలో సర్ఫు నీళ్లు పోసి ఉంచాలి. పురుగులు అందులో పడిపోయి ఎగరలేక చనిపోతాయి. ఒక్కో ఎకరాకు 3 లేదా 4 లైట్లు సరిపోతాయి.
సర్ఫు నీళ్లను రెండు రోజులకోసారి మార్చాలి: నాగ మల్లేశ్వరరావు 40 ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేస్తున్నారు. అన్నిచోట్లా ఈ తరహా లైట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సర్ఫు నీళ్లను రెండు రోజులకోసారి మార్చాల్సి ఉంటుందన్నారు. లైట్ల గురించి తెలుసుకున్న రైతు.. ముందుగా ఒకదాన్ని ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఉదయానికల్లా తొట్టె మొత్తం పురుగులతో నిండిపోయింది. దీంతో ఇదేదో బాగుందని చెప్పి 200 లైట్లు తెచ్చి 40 ఎకరాల్లో ఏర్పాటు చేశారు.
గతేడాది నాగమల్లేశ్వరావుకు ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ఈసారి ఇప్పటికే ఒక్కో ఎకరాలో 10 క్వింటాళ్లకు పైగా కోసి పెట్టారు. మరో నెల రోజుల పాటు కాపు ఉండే అవకాశముంది కాబట్టి 25 నుంచి 30 క్వింటాళ్లు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. లైట్ల ఏర్పాటు వల్ల మిర్చి కాపు కాలం పెరిగిందని తెలిపారు. గతంలో ఎకరాకు ఒక విడత మందు పిచికారి చేయాలంటే 3 నుంచి 5 వేల వరకూ ఖర్చయ్యేది.
ఇప్పుడు నల్లతామర, దోమ, పురుగుల కోసం వాడాల్సిన మందులు కొట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒక్కో ఎకరాకు 3 లైట్లు ఏర్పాటుకు రూ.4,500 ఖర్చయితే.. మందుల రూపంలో 20 నుంచి 25 వేల వరకూ ఆదా అయ్యాయని వివరించారు. నాగ మల్లేశ్వరరావు చేపట్టిన ప్రయోగాన్ని చూసేందుకు ఇతర జిల్లాల నుంచి కూడా రైతులు వచ్చి చూసివెళ్తున్నారు. ఈసారి తమ పొలాల్లోనూ ఈ తరహా ప్రయోగానికి సిద్ధమవుతున్నారు.
ఇవీ చదవండి: