తెలంగాణ

telangana

ETV Bharat / state

Crop loans: బ్యాంకులో అప్పు పుట్టదాయె.. బయట తెస్తే మిత్తీ భారమాయె - farmer are facing troubles for getting crop loans

ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమై నెల రోజులు దాటినా రైతులకు పంట పెట్టుబడుల తిప్పలు తప్పడం లేదు. రబీ సీజన్‌లో పండించిన పంట సొమ్ము.. ప్రభుత్వం నుంచి ఇంకా అందకపోవడంతో పాత బాకీలు తీర్చలేక అవస్థలు పడుతున్నారు. దీంతో రుణాలు దొరక్క వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. అందిందే అవకాశంగా వడ్డీ వ్యాపారులు తమ చేతి వాటాన్ని ప్రదర్శించి రోజుకు వేలకు వేలు మిత్తి రూపంలో రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. అటు బ్యాంకులు మాత్రం పాత బాకీ తీరిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని చెప్పడం.. ఇటు ఫైనాన్స్‌ వ్యాపారుల దోపిడితో భూమిని నమ్ముకున్న రైతు అరిగోసలు పడుతున్నాడు.

problems in crop loans
పంట రుణాల కోసం రైతుల తిప్పలు

By

Published : Jul 11, 2021, 7:01 AM IST

రాష్ట్రంలో పంట రుణాల పంపిణీ నత్తనడకన సాగుతోంది. దుక్కులు మొదలయ్యే మే నెల నుంచే పంట రుణాలను రైతులకు ఇస్తే వారికి పెట్టుబడుల కోసం వెదుక్కునే బాధలుండవు. కానీ వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌ ప్రారంభమై నెల దాటినా ఇంతవరకూ నిర్ణీత పంట రుణాల లక్ష్యంలో 30 శాతం కూడా బ్యాంకులు ఇవ్వలేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లోని ఒక బ్యాంకు శాఖలో 1,942 మంది రైతులకు ఖాతాలున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటికి రుణం అందుకున్నది కేవలం 14 మందే. గతేడాది వానాకాలం(జూన్‌ నుంచి సెప్టెంబరు) సీజన్‌లో బ్యాంకులు లక్ష్యానికన్నా 28 శాతం తక్కువగా రుణాలిచ్చాయి. పాత బాకీ కట్టినవారికే కొత్త అప్పు ఇస్తున్నట్టు బ్యాంకులు వివరిస్తున్నాయి. వరిధాన్యం, జొన్నలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మినా ఇంకా సొమ్ము రాకపోవడంతో పాత బాకీలను బ్యాంకులో కట్టలేకపోతున్నట్లు రైతులు వాపోతున్నారు.

మొత్తం కడితేనే

పంటరుణం తీసుకున్న రైతు కచ్చితంగా ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తేనే బ్యాంకులు 7 శాతం వడ్డీని వసూలుచేస్తున్నాయి. ఇలా ఏడాదిలోగా తిరిగి కట్టేవారి తరఫున 3 శాతం వడ్డీని తాము భరిస్తామని కేంద్రం ప్రకటించింది. ముందు మొత్తం కట్టేస్తే కేంద్రం నిధులిచ్చాక ఆ 3 శాతం వడ్డీ మొత్తాన్ని తిరిగి ఇస్తామని బ్యాంకులు పేర్కొంటున్నాయి. ఒకవేళ రుణం తీసుకున్న తేదీ నుంచి ఏడాదికి(365 రోజులకు) ఒక్కరోజు దాటినా వడ్డీని 10 నుంచి 12 శాతం వసూలుచేస్తున్నాయి. కొందరు ఫైనాన్స్‌ వ్యాపారులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పాత బాకీని తాము కడతామని తిరిగి 2, 3 రోజుల్లో బ్యాంకు ఇచ్చే కొత్త పంటరుణం నుంచి తమ బకాయి చెల్లించాలని, నెల వడ్డీ కలిపి కట్టాలని కొందరు రంగంలోకి దిగినట్లు ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు గ్రామంలో పత్తి, సోయా పంటలు సాగుచేస్తున్న రైతు వినాయకరెడ్డి వివరించారు.

ధరణి పోర్టల్‌లో వివరాల తప్పులతో అవస్థలు

ధరణి పోర్టల్‌లో భూముల వివరాలకు, పాత పట్టాదారు పాసుపుస్తకాల్లో లెక్కలకు పొంతన లేకపోవడంతో కొన్నిచోట్ల పాత బాకీలు కట్టినవారికి సైతం వెంటనే రుణాలు ఇవ్వడం లేదు. ఉదాహరణకు నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగడలోని ఓ మహిళా రైతుకు పాసుపుస్తకంలో 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వారి కుటుంబం కొన్ని దశాబ్దాలుగా బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటోంది. కానీ ధరణి పోర్టల్‌ ఇప్పుడు ఆ మహిళా రైతు పేరుతో కేవలం ఎకరం మాత్రమే ఉన్నట్లు చూపుతోంది. పాత బాకీ కట్టినా 3 ఎకరాలకు కాకుండా ధరణి పోర్టల్‌లో కనిపిస్తున్న ఎకరం భూమికి రూ.30 వేల వరకే కొత్త రుణం ఇస్తామని బ్యాంకు సిబ్బంది చెప్పారు. దీంతో బకాయి రూ.లక్ష కట్టి రూ.30 వేలు తీసుకోవడం ఎందుకని ఆమె బ్యాంకుకెళ్లడం లేదు.

రాష్ట్రంలో స్వల్పకాలిక పంట రుణాల ముఖచిత్రం

* మొత్తం రైతులు63లక్షలు
* రుణ ఖాతాలున్న వారు 55,74,152
* 2020-21 ఆర్థిక సంవత్సరం వానాకాలం, యాసంగి పంట సీజన్లలో కలిపి రైతులకు రూ.53,222 కోట్లను పంట రుణాలుగా ఇస్తామని 2020 జూన్‌లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి విడుదల చేసిన వార్షిక రుణ ప్రణాళికలో తెలిపింది. వాస్తవానికి రూ.41,200 కోట్లు మాత్రమే బ్యాంకులు ఇచ్చాయి.
* 2021-22లో మొత్తం పంట రుణాల పంపిణీ లక్ష్యం రూ.59,440 కోట్లు.
* ఇందులో ఈ వానాకాలంలో ఇవ్వాల్సినవి రూ.33 వేల కోట్లు కాగా ఇప్పటివరకూ పంపిణీ చేసిన రుణాలు రూ.9 వేల కోట్లనేది అనధికార అంచనా.

రుణమాఫీతో సంబంధం లేకుండా కొత్త రుణం తీసుకోవచ్చు

ప్రతీ రైతుకు పంట రుణం ఇవ్వాలని బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రుణమాఫీ పథకం కింద చెప్పిన గడువుకల్లా రూ.లక్షలోపు బాకీ ఉన్న రైతుల తరఫున ప్రభుత్వం బ్యాంకులకు నిధులిస్తుంది. రుణమాఫీతో సంబంధం లేకుండా ప్రతీ రైతు పాత బాకీ కట్టేసి కొత్త రుణం తీసుకోవచ్చు. ఏదైనా బ్యాంకులో సిబ్బంది రుణం ఇవ్వకుండా ఇబ్బంది పెడితే వెంటనే రైతులు సమీప వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేయండి. బ్యాంకులకెళ్లి రైతులకు రుణాలు ఇప్పించాలని వ్యవసాయాధికారులకు ఆదేశాలిచ్చాం. ఏ ఒక్క రైతు కూడా పంటరుణం కోసం ఇబ్బంది పడకూడదన్నది లక్ష్యం. ఇప్పటికే రుణాలను బ్యాంకులు ఇస్తున్నాయి. - నిరంజన్‌రెడ్డి, వ్యవసాయమంత్రి

బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా...

పంటరుణం కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా. సాంకేతిక సమస్యలున్నాయని రుణం రెన్యువల్‌ చేయడానికి ఇంకా సమయం పడుతుందని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. పాత బాకీ ఏడాదిలోపు కట్టి కొత్త పంటరుణం తీసుకుంటే వడ్డీ 4 శాతంతో పోతుంది. కానీ ఆ గడువుదాటినా బ్యాంకు అధికారులు పట్టించుకోవట్లేదు. వ్యవసాయాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.

- వెంకటయ్యగౌడ్‌, రైతు భైరంపల్లి గ్రామం, మహబూబ్‌నగర్‌ జిల్లా

3 శాతం వడ్డీని ఎందుకు వసూలు చేస్తున్నారు?

పాతబాకీ చెల్లించి కొత్త రుణం తీసుకున్నా. వడ్డీ 7 శాతం కట్టించుకున్నారు. ఏడాదిలోపు చెల్లిస్తే 3 శాతం వడ్డీని భరిస్తామని కేంద్రం చెప్పింది. మరి ఆ వడ్డీని బ్యాంకులు రైతుల నుంచి ఎందుకు వసూలు చేస్తున్నాయి? కేంద్రం ఇస్తామని చెబుతున్నా ఆ ప్రభుత్వం కింద పనిచేసే బ్యాంకులు నమ్మవా?

- గూడ నర్సింహారెడ్డి, మామిడి రైతు కట్కూరు, సిద్దిపేట జిల్లా

జొన్నలు అమ్మిన సొమ్ము ఇంకా రాలేదు

నాకు 4.50 ఎకరాల భూమి ఉంది. సోయా, పత్తి పంటలు వేశా. గతేడాది 2020 జూన్‌ 5న వానాకాలం సీజన్‌ కింద రూ.2 లక్షల పంటరుణం తీసుకున్నా. ఇప్పుడు దానిపై రూ.20 వేల వడ్డీతో కలిపి రూ.2.20 లక్షలు కడితే కొత్త పంటరుణం ఇస్తామని బ్యాంకు సిబ్బంది చెప్పారు. నెలక్రితం జొన్నలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్మితే రూ.లక్షన్నర ఇంకా ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో ఓ ఫైనాన్స్‌ వ్యాపారి ముందుకొచ్చాడు. బకాయి తాను కట్టేస్తానని బ్యాంకు వారిని తొందరపెట్టి 3 రోజుల్లోనే కొత్త రుణం ఇప్పిస్తానని అన్నాడు. అయితే ఈ మూడు రోజులకు రూ.లక్షకు రూ.2 వేల చొప్పున వడ్డీ లెక్కకట్టి ఇవ్వాలని షరతు పెట్టాడు. ఏం చేయాలో తెలియడం లేదు.

- కాంతారావు, రైతు, యాపల్‌గూడ, ఆదిలాబాద్‌ జిల్లా

రుణ మాఫీ బకాయిలు ఉండడంతో...

2018 డిసెంబరు 11 నాటికి 42 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో చెల్లించాల్సిన రూ.లక్షలోపు పంట రుణ బకాయిలన్నింటినీ మాఫీ చేస్తామని తెరాస అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 4 దఫాలుగా ఆ సొమ్మును విడుదల చేస్తామని తెలిపింది. గతేడాది రూ.1,197 కోట్లను ఇవ్వడంతో రూ.25 వేలలోపు బాకీ కట్టాల్సిన 3.80 లక్షల మంది ఖాతాల్లో వ్యవసాయశాఖ జమ చేసింది. ఇక రూ.25 వేల నుంచి రూ.లక్షలోపు బకాయి ఉన్న 38 లక్షల మందికి నిధులు విడుదల చేయాల్సి ఉంది. బకాయి ఉండటంతో ఆ బకాయి గురించి ఎక్కడ అడుగుతామోనని ఇలాంటి చాలామంది రైతులు పంట రుణం తీసుకోడానికి రావడం లేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలపై సర్కారు దృష్టి.. అందుకేనా?

ABOUT THE AUTHOR

...view details