Mallu Swarajyam: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం మృతిపట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై సంతాపం ప్రకటించారు. సాయుధ పోరాటంలో స్వరాజ్యం సాహసం ఎందరికో స్పూర్తి అని కొనియాడారు. కష్ట సమయంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో ఆమె భౌతికకాయానికి ప్రముఖ రాజకీయ నాయకులు నివాళులర్పించారు. ఎంబీ భవన్‌లో మంత్రి ఎర్రబెల్లి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, తెరాస ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆమె పార్థీవదేహానికి నివాళులర్పించారు.
క్రమశిక్షణకు మారుపేరు: ఎర్రబెల్లి
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం భౌతికకాయానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. ఎంతోమంది నేతలు, కార్యకర్తలకు ఆమె పూర్తి అండగా నిలిచారని ప్రశంసించారు. ఆమె పేదల కోసం పోరాడిందని తెలిపారు. స్వరాజ్యం మరణం దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆమె పేరిట ఎన్నో పుస్తకాలు, సినిమాలు రావాలని.. అవసరమైతే ప్రభుత్వం తరఫున సాయం చేస్తామని మంత్రి అన్నారు.
పేదల కోసం వీరోచిత పోరాటం: కోదండరాం
మల్లు స్వరాజ్యం పేదల కోసం వీరోచిత పోరాటాలు చేశారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కొనియాడారు. రాజకీయాలు వ్యాపారం కాదు ప్రజలకు శక్తినిచ్చే ఆయుధమని చాటి చెప్పారని ప్రశంసించారు. ఎంబీ భవన్లోని ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించారు.