హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రి డైట్ కాంట్రాక్టర్ కె.సురేష్ బాబుపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు రికార్డులతో రూ.1.18 కోట్లు స్వాహా చేశారంటూ.. నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీ కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేశారు. రోగులకు, వైద్యులకు భోజనం పెడుతున్నానంటూ చెప్పి రికార్డుల్లో వాటిని ఎక్కువగా చూపించి అక్రమాలకు పాల్పడిన సురేష్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను సూపరింటెండెంట్ కోరారు. దీంతో డైట్ కాంట్రాక్టర్ సురేష్ బాబుపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
టెండర్ దక్కించుకుని..
నిలోఫర్ ఆసుపత్రికి వచ్చే రోగులు, డాక్టర్లకు నాణ్యమైన ఆహారం అందిస్తానంటూ కె.సురేష్ బాబు నాలుగేళ్ల క్రితం టెండర్లలో పాల్గొని డైట్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. ఇన్ పేషంట్లుగా చికిత్స పొందుతున్న వారికి, జూనియర్ వైద్యులు సహా వైద్యులందరికీ సురేష్ బాబు...పాలు, బ్రెడ్డు, అల్పాహారం, రెండుపూటలా భోజనం అందిస్తున్నాడు. నెలనెలా బిల్లులను చూపించి ఆసుపత్రి అధికార వర్గాల నుంచి వాటిని పొందుతున్నాడు. గత జులైలో సురేష్ కాంట్రాక్టు పూర్తి కావడంతో ఆసుపత్రి వర్గాలు టెండర్లకు ఆహ్వానించాయి. సురేష్‌పై అప్పటికే ఆరోపణలు వస్తున్నందున టెండర్‌ను వేరే వ్యక్తికి అప్పగించారు.