High Level Committee Inquiry Falaknuma Express Fire Accident : ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై హై లెవల్ కమిటీ విచారణ ప్రారంభమైంది. సికింద్రాబాద్లోని రైల్వే సంచాలన్ భవన్లో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది నుంచి ఉన్నతస్థాయి విచారణ కమిటీ అవసరమైన వివరాలను సేకరిస్తోంది. ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ప్రమాదంపై వివరాలను అధికారులు సేకరించనున్నారు. ఫలక్‌నుమా ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగడం ప్రమాదమా..? కుట్ర కోణమా..? అనే దానిపై ఆరాతీస్తున్నారు.
మరోవైపు ఈ ప్రమాదంలో సామగ్రి, విలువైన వస్తువులు కోల్పోయిన ప్రయాణికుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రమాద ఘటన గుంటూరు డివిజన్ పరిధిలోకి రావడంతో.. ఆ రైల్వే డివిజన్ అధికారులు విచారణ చేపడుతున్నారు. సికింద్రాబాద్లోని రైల్వే సంచాలన్ భవన్లో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ కమిటీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై మెకానికల్, లోకో డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్, భద్రత విభాగాలు వివరాలు సేకరిస్తున్నాయి. ప్రత్యక్షసాక్షులు, అనుమానం ఉన్నవారి నుంచి ముఖ్య భద్రతా అధికారి, చీఫ్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసెస్ మేనేజర్ , ఇతర ఉన్నతాధికారులు సంఘటన వివరాలు సేకరిస్తున్నారు.
అసలేం జరిగిందంటే. : హావ్ డా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్.. యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఈ విషయాన్ని గుర్తించిన.. రైల్వే సిబ్బంది రైలును నిలిపివేసి ప్రయాణికులను దించేశారు. ఈ ఘటనలో ఐదు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ క్రమంలోనే మరిన్ని బోగీలకు మంటలు వ్యాపించకుండా ఉండేందుకు.. సిబ్బంది వాటిని ఆ బోగీల నుంచి విడదీసి.. మంటలు వ్యాపించకుండా ముందుగా జాగ్రత్తపడ్డారు.