Fake IPS officer Nagaraju arrested in Hyderabad : చిన్నప్పటి నుంచి పోలీస్ అధికారి కావాలని ఓ యువకుడు కలలు కన్నాడు. దానికోసం కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత నేరగాడిగా అవతారమెత్తి, ఖాకీ దుస్తులపై మోజు పెంచుకున్నాడు. దుస్తులు అమ్మే దుకాణానికి వెళ్లి పోలీసు, ఆర్మీ యునిఫామ్‌లు కొన్నాడు. ఐపీఎస్, ఆర్మీ అధికారిగా నకిలీ అవతారమెత్తాడు.
క్యాబ్‌డ్రైవర్‌గా పనిలోకి.. తూర్పు గోదావరి జిల్లా చిక్కాల గ్రామానికి చెందిన నాగరాజు రఘు వర్మ అలియాస్ కార్తిక్ డిగ్రీ పూర్తి చేశాడు. 2016లో హైదరాబాద్ వచ్చాడు. 2017లో సనత్‌నగర్ లోని గౌస్ పాషా ట్రావెల్స్‌లో క్యాబ్‌డ్రైవర్‌గా పనిచేశాడు. పనిచేసే సమయంలో అక్కడ ఇన్నోవా దొంగిలించాడు. ఈ కేసులో సనత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆరు నెలల తర్వాత విడుదల అయిన నాగరాజు నాలుగు నెలల పాటు మహారాష్ట్రలోని బోర్వెల్ సంస్థలో పని చేశాడు.
అర్మీ అధికారితో పరిచయం.. బిక్కుదర్ అనే మాజీ అర్మీ అధికారితో పరిచయం పెంచుకుని.. అతని వద్ద నుంచి ఆర్మీ ర్యాంకులు, డ్రెస్సులు, బ్యాచ్‌లు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నాడు. ఆర్మీ యునిఫామ్‌లు విక్రయించే చోటికి వెళ్లి.. మేజర్ ర్యాంకు యునిఫామ్‌లు కొన్నాడు. యునిఫామ్తో తన స్వగ్రామానికి వెళ్లి స్నేహితులకు, బంధువులకు తాను పారా స్పెషల్ ఫోర్స్‌లో మేజర్ నంటూ నమ్మించాడు. నిరుద్యోగ యవతకు ఆర్మీ ఉద్యోగాలు ఇస్తానంటూ అనుమతి లేకుండా డిఫెన్స్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించాడు. పోడూర్ పోలీసులకు అతనిపై అనుమానం రావడంతో ఆరా తీయగా నకిలీ అధికారి అని తేలడంతో ఆరెస్ట్ చేసి జైలుకు పంపారు.