Fake GST Registrations Telangana :జీఎస్టీ నకిలీ రిజిస్ట్రేషన్‌లతో భారీ ఎత్తున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సొమ్మును దోచేశారు. మరోవైపు దోచేసిన ఆక్రమార్కులపై కొరడా ఝలిపించే పని మొదలైంది. జీఎస్టీ నెట్‌వర్క్, రాష్ట్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా.. దేశవ్యాప్తంగా లక్షకుపైగా అనుమానాస్పద జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉన్నట్లుగా గుర్తించారు. వీటి ద్వారా వేల కోట్ల రూపాయల ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పేరున.. అక్రమార్కులు పొందినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ నకిలీల అట కట్టించేందుకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్టీ అధికారుల సమన్వయం కోసం.. ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని కేంద్రప్రభుత్వం నియమించింది. అదేవిధంగా రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులను సమన్వయం చేసేందుకు.. అటు రాష్ట్రం.. ఇటు కేంద్రం చెరో డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించుకున్నారు. తద్వారా ఇరువురు సమన్వయంతో పని చేసేందుకు వెసులుబాటు కల్పించుకున్నారు.
రాష్ట్రంలో 2,900 రిజిస్ట్రేషన్లు : తెలంగాణలో దాదాపు 2,900 రిజిస్ట్రేషన్లు అనుమానాస్పదంగా ఉన్నట్లు.. జీఎస్టీ అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,300 రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. ఇందులో దాదాపు 650 నకిలీవని తేల్చారు. ప్రధానంగా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు చూపిన అడ్రస్‌లో ఆ సంస్థ లేకపోవడం.. ఉన్నప్పటికి వ్యాపార లావాదేవీలు చేయకుండా కాగితాల మీదనే వ్యాపారం చేసినట్లు చూపిస్తున్నారు.
Authorities Action on Fake GST Registrations :తద్వారా రిటర్న్‌లు వేసి.. ఐటీసీ తీసుకోవడం లాంటివి ఇందులో ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ 650 బోగస్జీఎస్టీ రిజిస్ట్రేషన్ల ద్వారా దాదాపు రూ.1120 కోట్లు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ రూపేనా ప్రభుత్వ సొమ్మును దోచేసినట్లు గుర్తించారు. మరోవైపు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.162 కోట్ల ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ మొత్తాన్ని అధికారులు సీజ్ చేశారు.